ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అధికారపార్టీల ఎజెండాకు పొంతన లేకుండా పోయింది. ఒకరు రాష్ట్రం కోసం పోరాడుతూటే మరొకరు కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పార్లమెంట్ సమావేశాల్ని ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల ఎంపీలు ధర్నాలు చేశారు. అయితే ఒకే అంశంపై కాదు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన బకాయిల కోసం నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రాంతీయ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. 9 ప్రాంతీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.
అయితే ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన వైసీపీ ఎంపీలు పాల్గొనలేదు. అలా అని వారు.. ఖాళీగా లేరు. వారు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి ప్లకార్డులపై మాత్రం భిన్నమైన నినాదాలున్నాయి. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలనేది ఆ ప్లకార్డులపై డిమాండ్లు ఉన్నాయి. వైసీపీ ఎంపీల తీరు ఇతర రాష్ట్రాల ఎంపీలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అందరు ఎంపీలు తమ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ఆందోళనలు చేస్తూంటే.. వీరు మాత్రం..సీబీఐ విచారణ కోరడం ఏమిటన్న చర్చ జరిగింది.
అయితే వైసీపీ ఎంపీలు మాత్రం.. రాష్ట్రం కోసం ఏమైనా డిమాండ్ చేసినా.. కేంద్రం ఇస్తుందో లేదో కానీ.. కావాల్సినంత రాజకీయం చేసుకోవచ్చనుకుటున్నారేమో కానీ.. విచిత్రంగా సీబీఐ విచారణలు కోరుతున్నారు. ప్రభుత్వం సిఫార్సు చేసి పంపితే.. కేంద్రం సీబీఐ విచారణ చేయిస్తుంది. దాని కోసం ఢిల్లీలో .. పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృధా చేసుకుని ప్లకార్డులతో ..గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే వైసీపీ దేశంలో మూడో అతి పెద్ద పార్టీ. ఆ పార్టీకి సలహాలిచ్చేదెవరు..?