అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలివ్వడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం ఎవరు ఇస్తున్నారో తెలియకపోయినా ఎన్ని కోట్లయినా విరాళాలు తీసుకోవచ్చు. సహజంగానే బీజేపీకి అందరూ ఇస్తారు. అయితే ప్రాంతీయపార్టీల్లో బీజేపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక మొత్తం అందుకుంటున్న పార్టీ టీఆర్ఎస్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో పొందింది టీఆర్ఎస్.
ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కింది. రెండో స్థానంలో శివసేన ఉంది. ఈ పార్టీకి రూ. 111.403కోట్ల విరాళాలొచ్చాయి. మూడో స్థానంలో వైసీపీ ఉంది.. ఈ పార్టీకి రూ. 92.739కోట్లు విరాళాలొచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలు అందాయి. 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.
ఆదాయం వస్తోంది కానీ టీఆర్ఎస్ అసలు ఖర్చు చేయడం లేదు. మొత్తం ఆదాయంలో పదిహేనుశాతం కూడా ఖర్చు చేయడం లేదు. మిగతా అంతా మిగులులోనే ఉంది. అధికార పార్టీలు అన్నీ అంతే. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం విరాళాలు తగ్గిపోతున్నాయి… ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసి తెలుగు దేశం పార్టీ లోటులోకి వెళ్లిపోయింది. నిన్నామొన్నటి వరకూ ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పరిస్థితి కూడా అంతే ఒక్క బీజేడీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదాయానికి మించి ఖర్చుల్లోనే ఉన్నాయి.