తల్చుకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసేదాన్నని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ వ్యాఖ్యానించడాన్ని టీఆర్ఎస్ అడ్వాంటేజ్‌గా తీసుకుంది. గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారని మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నించడం ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి … తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారని తలసాని ప్రశ్నించారు. ప్రధాని, కేంద్రమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం ఏమిటన్నారు.
గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదని టీఆర్ఎస్ అంటోంది. గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడటం సరికాదు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని సూచించారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంకు, మంత్రులకు తెలుసన్నారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని గుర్తు చేశారు. డ్రగ్స్ విషయంలో కేంద్రానికి గవర్నర్ నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతూండటంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుటాహుటిన సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ అమ్మితే పబ్బుల్ని వదలబోమన్నారు
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయంగా కూడా చురుగ్గా ఉంటారు. అయితే ఇప్పటి వరూక తెలంగాణలో బీజేపీ నియమించిన గవర్నర్లు ఉన్నప్పటికీ వివాదాస్పదం కాలేదు. ఇటీవలే గవర్నర్‌తో విభేదాలు పెరగడంతో వివాదం ప్రారంభమయింది. ఈ వివాదం ఇంతటితో తేలే అవకాశం లేదు. మంత్రుల విమర్శలపై గవర్నర్ ఇంకా స్పందించలేదు.