వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని ఎమ్మెల్సీ ఎన్నికలలో బోణీ కొట్టిన తెరాస ఈరోజు అదేవిధంగా మరో రెండు స్థానాలను గెలుచుకొంది. మెదక్ నుంచి భూపాల్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి పూర్ణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ రెండు చోట్ల ఇతర పార్టీల అభ్యర్ధులు ఈరోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వారిరువురు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. వరంగల్ నుండి తెరాస అభ్యర్ధి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపటితో నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగుస్తుంది. ఈలోగా మరెక్కడయినా తెరాసకు మద్దతుగా తమ నామినేషన్లు ఉపసంహరించుకొంటారేమో రేపు సాయంత్రానికి తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరుగుతాయి. 30వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 12 సీట్లకు పోటీ చేస్తున్న తెరాస మిగిలిన 9 సీట్లు కూడా తామే గెలుచుకొంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ, తెదేపా చెరో ఒక్క సీటు స్వతంత్ర అభ్యర్ధి ఒక సీటు గెలుచుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.