నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. మామూలుగా అయితే రాజకీయ పార్టీల కసరత్తు చాలా కాలం కిందటే ప్రారంభించాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని అధికారికంగా ఖరారు చేసింది తప్పితే.. విన్నర్లు..రన్నర్లు అంటూ.. హడావుడి చేసే టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇంత వరకూ అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయాయి. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే… ఆ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దుబ్బాక వరకూ కేసీఆర్ అదే పాటించారు. కానీ సాగర్ విషయంలో మాత్రం.. ఆయన వ్యూహం మార్చారు. చనిపోయిన నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు ఇవ్వదల్చుకోలేదు. ఎన్నిక కీలకం కావడంతో అనేకానేక కరసరత్తులు చేస్తున్నారు.
యాదవ సామాజికవర్గానికే ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్… బలమైన నేతల కోసం… కొద్ది రోజులుగా సర్వేలుచేయిస్తున్నారు. మన్నే రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్ అనేఇద్దరు నేతలకు ఫోన్లు చేసి మాట్లాడారు. వీరిలో ఒకరికి చాన్సివ్వాలా లేకపోతే.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నేతను బరిలో నిలబెట్టాలా అన్న డైలమాలో ఉన్నారు. ఇంత వరకూ తేల్చుకోలేకపోయారు. అభ్యర్థి ఖరారు కాకపోయినాటీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ మాత్రం ఫుల్ స్వింగ్లో ఉంది. అభ్యర్థి లేకుండానే ఇప్పటికే అక్కడ ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేశారు.
ఇక గెలిచేస్తామని ప్రకటిస్తున్న బీజేపీకి కూడా అభ్యర్థి లేరు. బీజేపీ పరిస్థితిని చూసి…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు.. బ్లాక్ మెయిల్ తరహాలో ప్రకటనలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే తమ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ ఒక నిర్ణయానికొచ్చింది. టీఆర్ఎస్లో అసంతృప్త నేతలు వస్తారేమోనని ఆశిస్తోంది. తేరా చిన్నపరెడ్డిపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీలో ఉన్న నేతలు.. ప్రచారాలు చేసుకుంటున్నారు. వారెవరికీ టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ లేదు. తొలిసారిగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్తుల కోసం తంటాలు పడుతూండగా.. కాంగ్రెస్ చాలా ముందుగానే రంగంలోకి దిగింది. జానారెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు.