ముందు బీజేపీ ప్రకటిస్తే.. తర్వాత మేం అభ్యర్థిని ప్రకటిస్తాం అని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నారు. ముందు టీఆర్ఎస్ ప్రకటిస్తే.. ఆ తర్వాత మేం అభ్యర్థిని ఖరారు చేస్తామని బీజేపీ నేతలు తీర్మానించుకున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ పార్టీలో అసంతృప్తుల్లో ఒకరిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీ ప్లాన్. అలాంటిచాన్స్ బీజేపీకి ఇవ్వకూడదని.. అభ్యర్థిని ఫైనల్ చేసుకున్నా అధికారిక ప్రకటన చేయని పరిస్థితి టీఆర్ఎస్ది. నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగుస్తుంది. ఇప్పటికీ రెండు పార్టీలు అభ్యర్థులెవరో క్లారిటీ ఇవ్వలేదు.
టీఆర్ఎస్ అధినేత టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకున్నారు. కానీ బయటకు చెప్పడం లేదు. చనిపోయిన నర్సింహయ్య కుమారుడు భగత్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్ పేర్లు ప్రగతి భవన్ నుంచి లీకయ్యాయి. కానీ రిస్క్ ఎందుకని నోముల భగత్‌కే కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారని అంటున్నారు. కానీ ఇతర నేతలు బీజేపీలోకి వెళ్లకుండా వారి పేర్లనూ ఖరారు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరో తేలకపోయినా టీఆర్ఎస్ మాత్రం మండలాల వారీగా ఓ విడత ప్రచారం పూర్తి చేసేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలిచ్చారు.
మరో వైపు బీజేపీలో టిక్కెట్ పోటీ ఎక్కువగానే ఉంది కానీ.. వారంతా బలమైన అభ్యర్థులుగా బీజేపీ అగ్రనాయకత్వం భావించడం లేదు. టీఆర్ఎస్ నుంచి కోటి రెడ్డి లేదా చిన్నపరెడ్డిలను ఆకర్షించి.. పోటీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా… టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతేనే ఆలోచిస్తామని వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎస్టీ అభ్యర్థినిరంగంలోకి దింపితే ఎలా ఉంటుందా అని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. రవి నాయక్ అనే నేతను నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోమని సూచించినట్లుగా చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించడానికి మాత్రం సిద్ధంగా లేరు. మొత్తానికి ముందు నువ్వంటే.. నువ్వని.. రెండు పార్టీలు… పంతాలకు పోయి.. చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించకుండా ఉండేలా ఉన్నారనే సెటైర్లు పడుతున్నాయి.