తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ముందస్తు కోసం పరస్పర సవాళ్లు చేసుకుంటున్నాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇద్దరూ వ్యూహాత్మకంగా సవాళ్లు చేసుకుంటున్నట్లుగా పరిస్థితి ఉంది. ఇటీవల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని అమిత్ షా సవాల్ చేశారు. దానికి పోటీగా దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల తేదీ పెట్టాలని అసెంబ్లీని రద్దు చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలతో రెండు పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రజల్ని సిద్ధం చేస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వస్తోంది.
అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలు పెట్టరేమోనని ఇప్పటి వరకూ కేసీఆర్ డౌట్ !
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనల్లో ఎప్పట్నుంచో ఉన్నారు. ఎన్నికల తేదీని ప్రకటిస్తే తానే అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం సహకరించదన్న కారణగానే ఆగిపోతున్నట్లుగా ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎన్నికలు జరపకుండా రాష్ట్రపతి పాలన విధిస్తారన్న అనుమానం టీఆర్ఎస్ అధినేతలో ఉంది. 2018లో ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముందస్తుకు సంపూర్ణంగా సహకరించారు. అయితే ఈ సారి మాత్రం బహిరంగ యుద్ధం చేస్తున్నారు. అందుకే బీజేపీ సహకరించదని నమ్మకంతో ఉన్నారు. అందుకే వాళ్లని రెచ్చగొట్టి అయినా ఎన్నికలకు పెట్టే ఉద్దేశంతో కేసీఆర్ ఇలా అన్నారని భావిస్తున్నారు.
ఎన్నికలకు సిద్ధమని సంకేతాలు పంపుతున్న బీజేపీ నేతలు !
అయితే బీజేపీ నేతలు చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలు ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన రెండు సార్లు ముందస్తు గురించి చెప్పారు. తెలంగాణ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ముందస్తు వస్తాయి సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో బీజేపీ నేతలు వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పద్దతిలో సవాళ్లు చేస్తూండటంతో వ్యూహాత్మకంగానే రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాని నమ్ముతున్నారు.
ముందస్తు కోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయా ?
రెండు పార్టీలు సవాళ్లు చేసుకుని ముందస్తుకు వెళ్తే.. రెండు పార్టీల మధ్య పోటీ ఉందని జనం అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీని మాత్రం రేసులో లేకుండా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఏ ఎన్నిక జరిగినా బీజేపీనే ప్రత్యర్థిగా ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే.. బీజేపీ, టీఆర్ఎస్ పైకి ఫైటింగ్ చేస్తూ.. పైకి ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలవనున్నాయి. కానీ ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం వాటి మధ్య స్పష్టమైన అవగాహన ఉందని అనుమానాలు కలుగుతున్నాయి.