పదవులు రాలేదని.. ప్రాధాన్యం దక్కలేదని వెళ్లిపోయిన నేతల్ని సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కేసీఆరే పిలిస్తే.. ఏదో ఓ పదవి దక్కకపోతుందా అన్న ఆశలతో చాలా మంది వెనక్కి వస్తున్నారు. కానీ నిజంగా పొటెన్షియల్ అనుకున్న నేతలెవరూ రావడం లేదు వారిపై విస్తృతంగా మైండ్ గేమ్ ఆడినా ఒక్కరూ తొణకలేదు. దీంతో టీఆర్ఎస్లోనే చేరుతున్న వారితో ప్రయోజనమేంటి అన్న వాదన వినిపిస్తోంది.
టీఆర్ఎస్లో చేరుతున్న వారి వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా వస్తుందా ?
కేసీఆర్ పిలుపునకు వస్తున్న వారంతా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువలేని వాళ్లే. కనీస ప్రజాబలం వారికి లేదు. దాసోజు శ్రవణ్ నోరున్న నేత. బాగా మాట్లాడుతారు. కానీ ప్రజానేత కాదు. ఆయనకంటూ సొంత నియోజకవర్గం లేదు. గతంలో టీఆర్ఎస్లో పొలిట్ బ్యూరోలోనూ చోటిచ్చారు కానీ.. టిక్కెట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయడంతో వచ్చి చేరారని చెబుతున్నారు. ఇక స్వామి గౌడ్ ను భుజాలపై ఎక్కించుకుని మోయాల్సిందే తప్ప.. ఆయన వల్ల ఒక్క ఓటు అదనంగా రాదని టీఆర్ఎస్ నేతలే పెదవి విరిస్తున్నారు. అందుకే గతంలో పట్టించుకోలేదని.. ఇప్పుడు ఆఫర్లు ఇచ్చి మళ్లీ పిలిపించుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని వారి వాదన.
పదవుల కోసం వచ్చే వారితో ప్రయోజనం ఏమిటి ?
తాజాగా రాపోలు ఆనంద భాస్కర్ అనే మాజీ రాజ్యసభ సభ్యుడ్ని కూడా కేసీఆర్ చేర్చుకోవాలని నిర్ణయిచారు. ఆయనకూ ఆఫర్ ఇచ్చి ప్రగతి భవన్కు పిలిపించుకున్నారు. ఆయన స్వతహాగా జర్నలిస్టు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గాంధీలను పొగుడుతూ పుస్తకం రాసి.. ఆ కోటాలో రాజ్యసభ సీటు పొందారు. ఆరేళ్ల వరకూ పదవి అనుభవించి ..కాంగ్రెస్ పనైపోయిందనుకోగానే.. తన గాంధీల భక్తిని పూడ్చి పెట్టి బీజేపీలో చేరారు. అక్కడా పట్టించుకోవడం లేదని.. టీఆర్ఎస్ పిలవగానే వచ్చి చేరిపోతున్నరు. ఆయనకు ఏ పదవి ఇచ్చినా… తమను అవమానించడమేనని టీఆర్ఎస్ క్యాడర్ అనుకుంటే అందులో తప్పేమీ లేదు.
వారి రాకతో తమకు అన్యాయం అని టీఆర్ఎస్ క్యాడర్ ఆవేదన !
నిజానికి పార్టీలు మేలు చేసే స్టఫ్ ఉన్న నేతలు తిరిగి రావడం లేదు. వివేక్ వెంకటస్వామిని. .. జితేందర్ రెడ్డిని మళ్లీ రావాలని కోరుతున్నా వారు పట్టించుకోవడం లేదు. ఇలా పార్టీకి మేలు జరిగే నేతలు రాకపోవడం వల్ల … పదవుల కోసం వచ్చే నేతల్ని చేర్చుకోవడం వల్ల టీఆర్ఎస్కు మరింత బర్డెన్ అవుతోంది కానీ ప్రయోజనం లేదనే వాదన ఎక్కువ మందిలో ఉంది. కానీ రాజకీయాలు… చేరికల కోసం తప్పడం లేదు.