గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి చాలా కాలంగా కసరత్తు చేస్తున్న తెరాస పార్టీ ఊహించినట్లే అందరి కంటే ముందుగా తన అభ్యర్ధుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 150 డివిజన్లలో 60 డివిజన్లకి అభ్యర్ధుల పేర్లను ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవ్ రావు ఈరోజు తెలంగాణా భవన్ లో ప్రకటించేరు. ఈరోజు ప్రకటించిన మొత్తం 60 మంది అభ్యర్ధులలో బీసీలు:24, మైనార్టీలు:16, ఎస్సీలు:5 మంది, మిగిలిన వారు జనరల్ అభ్యర్ధులు ఉన్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పూర్తి పారదర్శకత పాటించామని కె.కేశవ్ రావు తెలిపారు.తెరాస ప్రకటించిన అభ్యర్ధులు రేపటి నుండి నామినేషన్లు వేయవచ్చును.
తెదేపా, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కానీ ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలనే విషయంపై రెండు పార్టీల మధ్య ఒక అవగాహనకు వచ్చేయి. రేపు ఏ స్థానాల నుండి ఏ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయాలనే విషయంపై ఇరు పార్టీలు చర్చించిన తరువాత జాబితాను విడుదల చేయవచ్చును.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా శనివారం తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీలు, లోక్ అదాలత్ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. అవి కూడా రేపు తమ జాబితాను విడుదల చేయవచ్చును.