తెలంగాణాలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని తెరాస ప్రకటించించి. ఇంతకు ముందు ఏడు స్థానాలకు తెరాస అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. మిగిలిన ఐదు స్థానాలకు కూడా అభ్యర్ధులను తెరాస సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు నిన్న ప్రకటించారు. వారిలో వరంగల్ నుండి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, రంగారెడ్డిలో ఉన్న రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్ నగర్లో ఉన్న రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి మరియు కసిరెడ్డి నారాయణరెడ్డిలను అభ్యర్ధులుగా కేశవరావు నిన్న ప్రకటించారు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇటిక్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు తెరాసలో చేరారు. కొన్ని నెలల క్రితమే తెరాసలో చేరిన కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, వామపక్షాలు అన్నీ చేతులు కలిపినా తెరాసకు వచ్చే నష్టం ఏమీ ఉండబోదని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్నందునే అన్ని స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తోందని అన్నారు.
ఆయన వాదనను తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. ఎన్నికలలో గెలవడం కోసం ప్రతిపక్ష పార్టీ సభ్యులపై, కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడుతూ వారిని భయబ్రాంతులకు గురిచేసి ఈవిధంగా వారిని ఫిరాయింపులకు ప్రోత్సహించడాన్ని ఆయన తప్పు పట్టారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వరంగల్ ఉప ఎన్నికలలో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని గొప్పలు చెప్పుకొంటునప్పుడు, మళ్ళీ ఈవిధంగా ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టి వశపరచుకొనే ప్రయత్నాలు ఎందుకు చేయవలసి వస్తోందని ఆయన ప్రశ్నించారు.