తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఫిర్యాదులు చేయడానికి.. ఇతర పార్టీల నేతలకు సమయం సరిపోవడం లేదు. ఈసీకి వరుస ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని పార్టీలు టీముల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎక్కడ తప్పు చేస్తారా అని వెదుక్కోవాల్సిన పని లేదు. టీఆర్ఎస్ వాళ్లే.. నేరుగా.. తమ మీడియాలో ఇచ్చిన వార్తల ద్వారానే వారికి ఫిర్యాదులకు కావాల్సిన సరంజామా అందిస్తున్నారు. మొన్నటికి మొన్న అరవింద్ రెడ్డి అనే నేతకు.. కేసీఆర్.. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ కండువా కప్పారు. కేటీఆర్ .. ఇద్దరు ఎంపీల్ని పిలిపించి.. రాజకీయాలు చర్చించారు. ఇవన్నీ టీఆర్ఎస్ మీడియానే ప్రచారంలోకి తెచ్చింది. దీన్ని బట్టి .. విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కానీ.. వాటికి ఎంత వ్యాలిడిటీ ఉంటుంది.. ఈసీ ఎంత సిన్సియర్‌గా తీసుకుంటుందన్నది తర్వాతి విషయం.
టీఆర్ఎస్ కూడా.. ఇలా ఈసీకి కంప్లైంట్లు చేయడానికి ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎంపీ వినోద్ కుమార్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు.. టీఆర్ఎస్పై అంత ఎక్కువగా… ఫిర్యాదులు చేస్తున్నారు కదా… తను చేయకపోతే ఏం బాగుంటుందనుని ఆలోచిస్తున్నారు.. కానీ ఏమీ దొరకడం లేదు. టీఆర్ఎస్ నేతలు పెట్టినట్లు కుల మీటింగులు పెట్టడం లేదు.. టీఆర్ఎస్ నేతల్లా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం లేదు. అయినా ఏదో ఓ ఫిర్యాదు చేయాలి కాబట్టి.. వినోద్ కుమార్ వెళ్లి ఓ ఫిర్యాదు చేశారు. అదేమిటంటే.. ఏపీ ప్రభుత్వ ప్రకటనలట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణలో నిలిపివేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రభుత్వ వ్యయంతో టీవీ ఛానెళ్లలో ఇస్తున్న ప్రకటనలు తెలంగాణలో కూడా ప్రసారం అవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది కాబట్టి ప్రభుత్వ ప్రకటనలు వద్దనేది ఆయన వాదన.
మరి ఈ విషయంలో ఈసీ స్పందన ఎలా ఉంటుందో కానీ.. పని లేక చేసిన ఫిర్యాదుగా.. మహాకూటమి నేతలు పేర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసుకుంటోంది. అంటే.. ఏపీ ప్రభుత్వ పథకాలు. తెలంగాణలో లేవు. తెలంగాణలో అమలు చేయరు. ఆ పథకాలు అమలు చేస్తామని.. ఎక్కడా చెప్పడం లేదు. అయినా..ఏపీ ప్రభుత్వ ప్రకటనపై వినోద్ అంత ఉలిక్కి పడుతున్నారెందుకో..! ఒక్కసారిగా.. నమస్తే తెలంగాణ పత్రిక కానీ.. టీవీ చానల్ కానీ… తాను ఫిర్యాదు చేసిన కోణంలో చూస్తే.. ఆయనకు తత్వం బోదఫడుతుంది. ఇలాంటి ఫిర్యాదు చేసినందుకు సిగ్గుపడతాడేమో..?