లగడపాటి సర్వేపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు..! ఏం చర్య తీసుకుంటారో..?మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ … ఓ మినీ సర్వేను ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పది మంది స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధిస్తారని.. జోస్యం చెప్పారు. రాజకీయ పార్టీల ప్రలోభాలను… ప్రజలు తిప్పికొట్టారని ప్రకటించారు. ఆ తర్వాత ఓ టీవీ చానల్‌తో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొని… హంగ్ అసెంబ్లీ రానే రాదని.. పూర్తి మెజార్టీ.. అధికారంలోకి వచ్చే పార్టీ సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సర్వేలపై… టీఆర్ఎస్కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే… తిరుమలలో ఆయన మాట్లాడిన మాటలు… టీవీ చానల్లో మాట్లాడిన మాటలు రికార్డు చేసి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని కోరింది.
సర్వేలపై లగడపాటి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో టీఆర్ఎస్ పేర్కొంది. ఓ పథకం ప్రకారం టీఆర్ఎస్పై రాజగోపాల్ దుష్ప్రచారం చేస్తున్నారనేది.. టీఆర్ఎస్ వాదన. లగడపాటి సర్వే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేటలో శివకుమార్.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో అనిల్ జాదవ్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు.. డిసెంబర్ 7న సాయంత్రం పూర్తి ఫలితాలు వెల్లడిస్తానని లగడపాటి ప్రకటించారు. రోజుకు ఇద్దరు చొప్పున స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో… ఆ ప్రభావం అక్కడి ఓటర్లపై ఉంటుందని.. ఇది ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిచడమేననేది.. టీఆర్ఎస్ లా పాయింట్.
అయితే.. లగడపాటి రాజగోపాల్ … తన అభిప్రాయం మాత్రమే చెప్పారని… అది సర్వే కాదని.. కొంత మంది వాదిస్తున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించడానికి ఎలాంటి ఆంక్షలు లేవని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు స్పష్టంగానే ఉన్నాయని… ప్రజాభిప్రాయసేకరణ, ఎగ్జిట్ పోల్స్, సర్వేలు లాంటివి పోలింగ్ ముగిసే వరకూ వెల్లడించకూడదనేది.. నిబంధన. అయితే.. తాను సర్వేను వెల్లడిస్తున్నానని లగడపాటి చెప్పడం లేదు. అయినప్పటికీ.. ఈసీ ఏం చర్య తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈసీ భావిస్తే నోటీసు జారీ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమవుతుందంటే.. ఎవరూ చెప్పలేరు.. ఎందుకంటే.. ఇప్పటికి కొన్ని వందల నోటీసులు జారీ చేశారు.. కానీ ఏ ఒక్కరిపైనా తదుపరి చర్యలు తీసుకోలేదు మరి..!