జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెంటే జగన్ ఉంటారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తేల్చిచెప్పేశారు. ఈ మేరకు అంతర్గతంగా ఓ అవగాహన ఉందని ఆయన చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతోంది. జాతీయ పార్టీ పెట్టబోతున్న కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నాయకుల్ని కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కేసీఆర్, జగన్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వారి మధ్య పీకే కూడా కలిశాడు. రెండు పార్టీలకు పీకే నే వ్యూహకర్త. పీకే నేరుగా కేసీఆర్ కోసం పని చేస్తూండగా.. జగన్ కోసం ఆయన టీం పనిచేస్తోంది.
ఏపీలో జగన్ అధికారంలోకి రావడంలో కేసీఆర్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. కేంద్రంలోని బీజేపీ తెలుగుదేశం పార్టీని కట్టడి చేస్తే.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ జగన్కు కావాల్సిన ఎన్నికల అవసరాలను తీర్చిందని చెబుతారు. అందుకే జగన్ గెలిచిన వెంటనే ప్రగతి భవన్కు వెళ్లారు. ఆ తర్వాత పలుమార్లు సమావేశాలు జరిపారు. మూడు, నాలుగు సార్లు అధికారులు లేకుండానే కేసీఆర్, జగన్ చర్చలు జరిపారు. ఓ సారి ఇలా చర్చలు జరిపిన తర్వాత బీజేపీని ఎలా దింపేయాలన్నదానిపై చర్చించారన్న అంశం లీక్ అయింది. అది కలకలం రేపడంతో … వైసీపీ ఖండించింది. కానీ కేసీఆర్ మాత్రం ఖండించలేదు.
ఆ తర్వాత నుంచి బహిరంగంగా కేసీఆర్, జగన్ మధ్య చర్చలు జరగలేదు. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిస్తే జగన్ కు ఇబ్బందని కేసీఆర్ కూడా సైలెంట్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు. రేపు కేంద్రం లో వైసీపీ కి ఉన్న ఎంపీలు కీలకం అయితే కేసీఆర్ గుప్పిట్లోనే ఉంటారన్న నమ్మకం టీఆర్ఎస్ కు ఉంది. అందుకే.. ఇప్ుడు ఆ పార్టీని కూటమిలోకి పిలిచినా పిలవకపోయినా పర్వాలేదని.. జగన్కు బీజేపీ నుంచి ఇబ్బంది రాకుండా చూసుకుంటే చాలన్న భావనలో టీఆర్ఎస్ అధినేత ఉన్నారంటున్నారు. ఆ విషయాన్నే మంత్రి గంగుల నేరుగా చెప్పారని అనుకోవచ్చు.