పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ విచిత్రాలు బయట పడుతున్నాయి. లోపాయికారీ పొత్తల వ్యవహారం వెలుగులోకి వస్తోంది. గ్రేటర్లో పోటీ చేస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు ఐదు రోజులుగా ప్రచారం నిలిపి వేశారు. అనారోగ్యం సాకుతో వెళ్లి ఆస్పత్రిలో చేరిపోయారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఠాగోపాల్.. చివరి క్షణంలో టిక్కెట్ దక్కించుకున్నారు. టిక్కెట్ రాక ముందు దూకుడుగా ప్రచారం చేసిన ఆయన టిక్కెట్ వచ్చిన తర్వాత చల్లబడిపోయారు. ఐదు రోజుల కిందట.. ప్రగతి భవన్లో కేటీఆర్‌తో సమావేశానికి వెళ్లారు. అక్కడేం చర్చించుకున్నారో కానీ… నేరుగా బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరిపోయారు. అప్పట్నుంచి ప్రచారం పడకేసింది. ప్రగతిభవన్ బాత్రూంలో పడిపోయారని..అందుకే ఆస్పత్రిలో చేర్పించామని ముఠాగోపాల్ అనుచరులు చెప్పుకొచ్చారు. బహుశా.. ఇక ప్రచారం ఆపేయమని చెప్పి ఉంటారని..అందుకే పడిపోయి ఉంటారని ఆయన అనుచరులు సెటైర్లు వేస్తున్నారు.
ఇంతకీ..ముఠా గోపాల్ తో ఎందుకు టీఆర్ఎస్ ఇలా చేయించాల్సి వస్తోందంటే.. దానికో విజన్ ఉంది. ముషీరాబాద్ లో పోటీ చేస్తోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి లక్ష్మణ్ బయటపెడ్డారు. కానీ ఈ సారి ఎవరి పొత్తు లేదు. సొంత ఓటు బ్యాంక్ లేదు. లక్ష్మణ్ ఏమైనా మాస్ లీడరా అంటే కాదు..అందుకే…రాష్ట్ర అధ్యక్షుడే ఓడిపోతే నవ్వుల పాలు కావాల్సి వస్తుందని.. టీఆర్ఎస్ను లైట్ తీసుకోమని బీజేపీ హైకమాండ్ కోరిటన్లు తెలుస్తోంది. ఇలా లైట్ తీసుకోమన్న నియోజకవర్గం.. గ్రేటర్లో మరొకటి ఉంది. అదే గోషా మహల్. అక్కడ ప్రేమ్ సింగ్ రాథోడ్‌ను… బరిలోకి దింపింది టీఆర్ఎస్. ఈయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఎంతో కొంత పట్టు ఉంది . ఉత్తరాది నేపధ్యం ఉంది. అందుకే.. రాజాసింగ్‌కు పడాల్సిన ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో.. ఆయన్ను కూడా ఆస్పత్రికి పంపించారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ముఖేష్ గౌడ్ గోషామహల్ లో రంగంలో ఉన్నారు. అక్కడ ఎంఐఎం పోటీలో లేదు. ఓవైసీ చెబుతున్నట్లుగా… అక్కడ టీఆర్ఎస్కు.. ముస్లింలు ఓటు వేసే అవకాశం లేదు. రాజాసింగ్ ను ఓడించాలంటే.. అది ముఖేష్ గౌడ్ వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. పైగా ముస్లింలతో ముఖేష్ గౌడ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలున్నాయి. అందుకే.. రాజాసింగ్ బయటపడాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి ఆస్పత్రిలో చేరాల్సిదేనని డిసైడయ్యారు. అలా కానిచ్చేశారు. ఈ రెండే కాదు.. ముందు ముందు.. మరికొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఇదే వ్యూహం అమలు చేయబోతోందంటున్నారు. తమ పార్టీ గెలిచే చాన్స్ లేకపోతే.. కలసి వచ్చే వారికి ఓట్లు వేయించి.. వారిని తమ ఖాతాలోకి లాక్కునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.