తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీ తెరాస మద్దతుదారులే హవా కొనసాగించారు. శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీలకే అనుకూలంగా ఉంటాయి. అయితే, ఎమ్మెల్యే ఎన్నికల్లో విపక్షాలు ఓటమిని చవిచూడ్దంతో… పంచాయతీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, తమ మద్దతుదారులను గెలిపించే వ్యూహాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. దీంతో క్షేత్రస్థాయి ఎన్నికల్లో కూడా తెరాస మద్దతుదారుల హవా కనిపిస్తోంది. మొదటి విడతలో దాదాపు 4వేలకుపైగా పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఓ 700లకుపైగా ఏకగ్రీవమైన వాటిల్లో కూడా ఒకటో రెండో తప్ప, అన్నీ తెరాస మద్దతుదారులకు అనుకూలంగానే ఉన్నాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో కూడా తెరాస అనుకూల పవనాలే బలంగా ఉన్నాయి. మిగిలిన రెండు దశల ఎన్నికల్లో కూడా అనూహ్యంగా ఫలితాలు మారిపోయే అవకాశం ఏమీ లేదనే చెప్పాలి. తెరాస హవా కొనసాగుతుందనే చెప్పొచ్చు.
నిజానికి, అసెంబ్లీ ఎన్నికల వైఫల్యం నుంచి పార్టీ శ్రేణులను వీలైనంత త్వరగా బయటకి తెచ్చేందుకు ఈ పంచాయతీ ఎన్నికల్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావించింది. లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను మరోసారి సమాయత్తం చేయాలంటే… పంచాయతీల్లో తెరాస మద్దతుదారులకు గట్టి పోటీ పెట్టాలనే అనుకున్నారు. దానిపై రాష్ట్ర నేతల మధ్య కొంత చర్చ జరిగింది. కానీ, చివరికి వచ్చేసరికి… ఆ తరహా ప్రయత్నమేదీ కాంగ్రెస్ నుంచి కనిపించలేదు. పంచాయతీ ఎన్నికల్లో వస్తే ఎంత, పోతే ఎంత అనుకున్నారేమో మరి! దీంతో ఈ ఎన్నికలు తెరాస మద్దతుదారులకు నల్లేరు మీద నడకగా మారిపోయింది. కాబట్టి, ఈ ఫలితాలపై కూడా ఏమంత ఉత్కంఠ ఎక్కడా కనిపించని పరిస్థితి.
పంచాయతీ ఎన్నికల్లో కూడా విరివిగా ధన ప్రవాహం కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే… ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఓటు రేటు పెరిగిందని కొంతమంది ప్రజలే చెప్తున్న పరిస్థితి ఉంది! ఇక, గతంలో పంచాయతీ ఎన్నికలంటే… స్థానిక సమస్యల ప్రాతిపదిక జరిగేవి. గ్రామాల్లో కాలువలు బాగుచేస్తాం, కమ్యూనిటీ హాలు కడతాం, కుళాయిలు మరమ్మతులు చేపడతాం.. ఈ తరహా హామీలు ఉండేవి. కానీ, ఈసారి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెరాస మేనిఫెస్టోనే కనిపించడం విశేషం! పెన్షన్లు వస్తాయనీ, రైతుబంధు వస్తుందనీ, నిరుద్యోగ భృతి వస్తుందనీ… ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశాలనే క్షేత్రస్థాయిలో పంచాయతీ అభ్యర్థులు కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది.