తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. మంత్రులు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు ప్రారంభించారు. ఆర్డీఎస్ కుడి కాలువ, రాయలసీమ ఎత్తిపోతలను అనుమతుల్లేకుండా నిర్మిస్తున్నారంటూ కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ఈ ఆరోపణల స్థాయి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేస్తూనే రాజకీయంగా… అనాల్సిన మాటలన్నీ అంటున్నారు. నిన్నటిదాకా కాస్త పద్దతిగా మాట్లాడిన నేతలు రోజు గడిచే కొద్దీ డోసులు పెంచుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్‌ను తిట్టే బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డి… మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీసుకున్నారు. ప్రశాంత్ రెడ్డి జలవనరుల మంత్రి కావడంతో సహజంగానే ఆయనకు బాధ్యత ఉంది.
దీంతో ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో ఇబ్బంది వస్తే అది తనకే మైనస్ అవుతుంది. అందుకే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్ నీటి దొంగ అయితే..జగన్‌రెడ్డి గజదొంగ అని విమర్శిస్తున్నారు. జగన్ తండ్రి వైఎస్ పోతిరెడ్డిపాడు నుంచి 40 వేల క్యూసెక్కులు దోచుకుపోయారని.. ఇప్పుడు జగన్‌రెడ్డి దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ, ఆర్డీఎస్ రైట్ కెనాల్ నిలిపివేయకుంటే ప్రజాయద్దం జరుగుతుందని హెచ్చరించారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయలసీమ ప్రాజెక్టు లను అడ్డుకుంటామని..ప్రకటించారు. టీఆర్ఎస్ హైకమాండ్ అనుమతి లేకుండా.. ఇలాంటి వ్యాఖ్యలను మంత్రులు చేసే అవకాశం లేదు. కేబినెట్ సమావేశంలో స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి జగన్‌ను మూర్ఖుడు అని పిలిచారని.. టీఆర్ఎస్ వర్గాలే మీడియాకు లీక్ ఇచ్చాయి.
టీఆర్ఎస్ నేతల తిట్ల పురాణంపై వైసీపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. వారు వ్యక్తిగత విమర్శలుచేసినా.. ఏమీ అనడం లేదు. వారి గురించి దేవుడే చూసుకుంటాడని సినిమా డైలాగులతో పాటు వైసీపీ మార్క్ లాంగ్వేజ్ ప్రయోగంలో సిద్ధహస్తుడిగా పేరున్న అనిల్ కుమార్ చెబుతున్నారు. ఆయనే అంత సంయమం పాటిస్తే ఇతరులు విరుచుకుపడే పరస్థితి లేదు. టీఆర్ఎస్ నేతలు ఎంత కాలం తిడతారో.. వాటిని వైసీపీ నేతలు ఎంత కాలం భరిస్తారో కానీ.. ఇప్పటికైతే సైలెంట్‌గా ఉంటున్నారు.