తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలస్యం చేయకుండా జాతీయ పార్టీ పెట్టి అర్జంట్‌గా దేశాన్ని బాగు చేయాలని కోరుతున్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు. జిల్లా అధ్యక్షులందర్నీ పిలిపించి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకంగా పిలిచినా పది మందికిపైగా జిల్లాల అధ్యక్షులు రాలేదు. వచ్చిన 22 మంది జిల్లా అధ్యక్షులతో ప్రెస్ మీట్ పెట్టిన బాల్క సుమన్.. కేసీఆర్ వెంటనే .. అంటే ఆలస్యం చేయకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని మోడీ వందేళ్లు వెనకకు తీసుకెళ్లారని.. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారి వాదన. దేశం లోని అన్ని వర్గాలు మేధావులు , పార్టీ ల నేతలు కేసీఆర్‌ను సంప్రదిస్తున్నారని అందుకే ఆలస్యం చేయకూడదనివారంటున్నారు. తెలంగాణ ను బాగు పరిచినట్టే కేసీఆర్ దేశాన్ని బాగుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత చేతి లో ఉండాలని.. కేసీఆర్ ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని అమలు చేస్తామని జిల్లా అధ్యక్షులు ప్రకటించారు.
అసాధారణ వనరులున్న దేశానికి అసాధారణ తెలివి తేటలున్న కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠం తో కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను దేశ ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ లోనే కేసీఆర్ మొదటి జాతీయ పార్టీ సభ పెట్టాలని వారు కోరారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఇలా జిల్లాల అధ్యక్షులు ప్రెస్ మీట్ పెట్టడం… రాజకీయవర్గాల్లో భిన్నమైన చర్చకు దారి తీస్తోంది. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపాలనుకుంటున్నారా లేకపోతే.. కేసీఆర్‌ను అందరూ పిలుస్తున్నారన్న ఫీలింగ్ కల్పించడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అన్నదానిపై మాత్రం సందేహం అలాగేఉంది.