దేశ రాజకీయాల్లో మార్పుల కోసం తాను ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేస్తున్నానని ఏడెనిమిదేళ్ల నుంచి ఆయన మిత్రుడని కేసీఆర్ ప్రకటించారు.దానికి తగ్గట్లుగా పీకే కొన్నాళ్లు తెలంగాణలో మకాం వేసి టీఆర్ఎస్ పాలనపై సర్వేలు నిర్వహించారు. కొన్ని రిపోర్టులు కూడా ఇచ్చినట్లుగా కేసీఆర్ తెలిపారు. అయితే ఇప్పుడు ఏమయిందో కానీ అనూహ్యంగా పీకే టీం తాము తెలంగాణలో కేసీఆర్‌కు పని చేయడం లేదన్న సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. గుజరాత్లో కాంగ్రెస్‌కు పని చేసేందుకు ఆసక్తి చూపుతున్న పీకే… ఇక ఆ పార్టీతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ఢిల్లీలో సాగుతోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై ఆయన టీం ఓ సర్వే చేసింది. ఆ తర్వాత పీకే కొన్ని వ్యూహాలు కేసీఆర్కుచెప్పినట్లుగా తెలుస్తోంది. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు పని చేస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎలా చేస్తారన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్తో ఐ ప్యాక్ టీం ఇంకా ఒప్పందం చేసుకోలేదని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ తో పీకే ప్రయాణం ముగిసినట్లేనని భావిస్తున్నారు.
ఇటీవల కేసీఆర్ పీకే మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఆయన దగ్గర మంచి ఆర్ట్ ఉందన్నారు. ఈ క్రమంలో పీకే దూరం అయితే కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితే. మారుతున్న రాజకీయాలకు తగ్గట్లుగా స్ట్రాటజిస్ట్ అవసరం అని.. అదీ ప్రశాంత్ కిషోర్ అయితేనే మంచిదని కేసీఆర్ అనుకుంటున్న సమయంలో ఆయన దూరం కావడం.. టీఆర్ఎస్ కు ఇబ్బందికరమే. ఆయన సేవలు తమకు దూరం అయి.. కాంగ్రెస్‌కు దగ్గర అయితే.. కేసీఆర్‌కు పెద్ద దెబ్బే అనుకోవచ్చు.