టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మేనిఫెస్టోలో ఓ భాగాన్ని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అందులో ఉన్న హామీలు ఇంచుమించుగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల్లాగే ఉన్నాయి. నిరుద్యోగ భృతి, రూ.లక్ష రుణమాఫీ, పెన్షన్ల పెంపు.. ఇలా అన్నీ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హమీలే. కాకపోతే… సెంటిమెంటల్‌గా ఓ కాంగ్రెస్ వాళ్లిస్తామన్న దాని కన్నా.. ఓ రూ. 16 ఎక్కువ ఇస్తామని వాటిలోఉంది. ఆ కొద్ది భాగం మేనిఫెస్టోను చూసి.. కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారు. తమను కాపీ కొట్టారని మండిపడ్డారు. కానీ వాళ్లు కూడా ఊహించని విధంగా పూర్తి స్థాయి మేనిఫెస్టో ఉండబోతోందట. కేసీఆర్… ఆరో తేదీన.. పూర్తి స్థాయి వరాలను తెలంగాణ ప్రజల ముందు పరచబోతున్నారు.
దీనికి సంబంధించిన సూచనలు ఒక్కొక్కటిగా.. కేటీఆర్ బయటకు ఇస్తున్నారు. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని… ఓ భాగం హామీల్లో ప్రకటించారు కానీ.. ఎలా చేస్తారన్నదానిపై కేసీఆర్ హామీ ఇవ్వలేదు. గతంలో చేసినట్లు చేస్తామని చెప్పడంతో… విడతల వారీగానేనని.. అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒకే విడతలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని యాదాద్రి ప్రచారసభలో ప్రకటించారు.
సెంటిమెంట్ ను ఫాలో అయ్యే కేసిఆర్ నవంబర్ 6 న పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోలో .. ప్రధానంగా అరవై హామీలు ఉండబోతున్నాయట. ఇవన్నీ.. ఓట్లు కురింపించే.. జనాకర్షక హామీలేనంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
వేయడానికి మేనిఫెస్టో కమిటీ అంటూ కేకే నేతృత్వంలో ఓ కమిటీని వేసినా… ఇటీవలి కాలంలో ఫామ్‌హౌస్‌లో మకాం వేసిన కేసీఆర్.. మేనిఫెస్టోకి తుది రూపం ఇచ్చారట. కేకే కమిటీకి…వివిధ వర్గాల నుంచి వచ్చిన 300 కు పైగా విజ్ఙప్తులను ఆ కమిటీ కేసీఆర్‌కు అందించారు. వీటన్నింటినీ స్వయంగా పరిశీలించి పథకాలను సిద్ధం చేశారు. దళితుల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని గమనించి.. కడియం శ్రీహరిని ప్రత్యేకంగా పిలిపించి ఓ రోజంతా చర్చించి… దళితలకు వరాలను రెడీ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో… మేనిఫెస్టో ఉంటుందని… దేశం మొత్తం టీఆర్ఎస్ ఇచ్చే హామీల గురించి చర్చించుకుంటుందని.. టీఆర్ఎస్ నేతలు ముందుగానే చెప్పుకొస్తున్నారు. అయితే తమ పాలననే మేనిఫెస్టోగా చెప్పుకుని ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఉచిత హామీల వరద పారిస్తే నమ్మేదెవరని.. కాంగ్రెస్ నేతలు అప్పుడే సెటైర్లు కూడా వేస్తున్నారు.