తెలుగుదేశం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ రాజకీయంగా చాలా పరిణామాలకు కేంద్రబిందువుగా మారుతోంది! ఆయన పార్టీ వీడతారో లేదో తెలీదుగానీ… కాంగ్రెస్ లో చేరిపోవడం దాదాపు ఖాయమైపోయినట్టుగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. వచ్చే నెల రెండోవారంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం పక్కా అని కొంతమంది అంటున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లింది తన వ్యక్తిగత విషయాలపైన అని చెబుతున్నారనీ, రాహుల్ ను కలిసినట్టు మీడియా కథనాలు వస్తున్నాయంటూ ఇంకోపక్క ఎల్. రమణ వంటి టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్ లోకి వస్తే పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరిగిపోయింది. రేవంత్ రాకపై కొంతమంది కాంగ్రెస్ పెద్దల మూతి విరుపులు, రాష్ట్ర వ్యవహార ఇన్ ఛార్జ్ కుంతియా నుంచి అక్షింతలు కూడా అపోయాయి. ప్రతిపక్ష పార్టీల్లో ఇంత హడావుడి జరుగుతూ ఉంటే అధికార పార్టీ తెరాస చూస్తూ ఊరకుంటుందా చెప్పండీ..! పార్టీ మారేలోగా రేవంత్ ను వీలైనంత బలహీనం చేసేందుకు తెరాస కూడా ప్రయత్నాలు చేస్తోంది.
ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి తనతోపాటు కాంగ్రెస్ లోకి రాబోతున్న నేతల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఆ జాబితాలో ఉన్నవారంతా ఇప్పుడు రేవంత్ వెంట ఉంటున్నారా, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా అనేదే ప్రశ్నగా మారింది. ఎందుకంటే, రేవంత్ కు ప్రధాన అనుచరులుగా ఉన్న కొడంగల్ నాయకులపై తెరాస కన్నుపడింది. ఇప్పటికే ఓ ఇద్దరు ప్రముఖ స్థానిక నాయకుల్ని తెరాసలోకి అతి కష్టమ్మీద ఆకర్షించేశారు. గులాబీ కండువా కప్పేశారు. రేవంతుడి సొంత నియోజక వర్గంపై ఇద్దరు మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. కొడంగల్ నియోజక వర్గంతోపాటు, జిల్లాలోని ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులపై వారి కన్ను పడిందనీ, ఇప్పటికే చాలామందిని పిలిచి చర్చలు జరిపారంటూ సమాచారం.
ఇంతకీ.. తెరాస వ్యూహం ఏంటంటే, రేవంత్ రెడ్డిని బలహీన పరచడం. ఆయన తెలుగుదేశం పార్టీని వీడినా, తూచ్ అంటూ వీడకున్నా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతల్ని దూరం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పనిలోపనిగా కాంగ్రెస్ కు కూ ఝలక్ ఇచ్చినట్టు అవుతుంది కదా. రేవంత్ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించేలోగానే ఆయన కేడర్ ను తెరాసలోకి చేర్చేస్తే… కాంగ్రెస్ కూడా పునరాలోచనలో పడే పరిస్థితి కల్పించినట్టు అవుతుందనీ, ఈలోగా టీడీపీలో రేవంత్ వ్యవహారం చెడుతుంది కాబట్టి.. ఆయన రెంటింకీ చెడ్డట్టు చేయ్యొచ్చనేది అధికార పార్టీ ఆపరేషన్ లక్ష్యం కొంతమంది చెబుతున్నారు. అందుకే, ఇప్పుడు రేవంత్ రెడ్డితో పార్టీ మారేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.