గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు.. మళ్లీ ఈసేవా కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. ప్రభుత్వం ఇస్తానన్న పదివేల కోసం…బాధితులుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరూ ఈసేవా కేంద్రాల వద్దకు రావొద్దని.. అధికారులే ఇళ్ల వద్దకు సాయం అందిస్తారని చెబుతున్నారు. వరద సాయంపంపిణీ నిలిపివేయడానికి ముందు ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు పెద్ద ఎత్తున బాధితులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. సాయం నిలిపివేశారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉదయం దరఖాస్తు చేసుకుంటే.. సాయంత్రానికి ప్రభుత్వ సాయం అకౌంట్లో పడటంతో.. పెద్ద ఎత్తున ఈసేవా కేంద్రాల వద్దకు బాధితులు వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ఇస్తారన్న నమ్మకంతో చాలా మంది బాధితులు ఈ సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో విజయం దక్కకపోవడంతో టీఆర్ఎస్ సర్కార్ కూడా.. సాయం అందించడంలో అంత ఆసక్తిగా ఉన్నట్లుగా లేదు. అందుకే.. ఈసేవలో నమోదు చేసుకోవద్దని అధికారులే వచ్చి.. పరిస్థితిని అంచనా వేసి.. సాయానికి అర్హులో కాదో చెబుతారని అంటున్నారు.
వరదలు వచ్చినప్పుడే… నష్టం అంచనాకు రాని అధికారులు ఇప్పుడు వస్తారని ప్రజలు నమ్మడం లేదు. అందుకే.. ఈసేవలోనే తమ పేర్లను నమోదు చేసుకుని పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆరు వందల కోట్ల వరకూ వరద సాయం పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. కేటాయించిన మొత్తం రూ. 550 కోట్లు మాత్రమే. అంటే.. ఇక ఎవరికీ పంపిణీ చేయకపోవచ్చనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.