ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చీకోటి ప్రవీణ్ కేసినో కేసుతో పాటు తాజాగా మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేశారు. రేపు ఎవరిపై చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా మంది ఐటీ, ఈడీ రాడార్‌లో ఉండాలని జాగ్రత్తగా ఉండాలని సీఎం కసీఆర్ కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తుడిపేసుకోలేని వ్యవహారాలు ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తూంటాయి. దీంతో ఆయా నేతలకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు.
మల్లారెడ్డి పెంచుకున్న వ్యవస్థపై ఏకంగా యాభై బృందాలతో దాడులు చేశారు అధికారులు. సమాచారం బయటకు లీక్ కావడం లేదు కానీ.. కొన్ని వందల కోట్ల అవకతవకలు బయటపడే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి చేసే వ్యాపారాలన్నీ అలాంటివే. మెడికల్ కాలేజీల్లో అయితే.. ఒక్కో సీటుకు కోట్లు వసూలు చేస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యాపారాలు చేసేవారు టీఆర్ఎస్లో చాలా మంది ఉన్నారు. ఇది బిగినింగ్ స్టేజేనని.. టీఆర్ఎస్ ఆర్థిక మూల స్తంభాలుగా ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతాయని భావిస్తున్నారు.
ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కోండి అని కేసీఆర్ చెబుతున్నారు కానీ.. పార్టీ నేతల్లో మాత్రం ధైర్యం సన్నగిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఏ చిన్నది దొరికినా వదిలి పెట్టరని..కేసీఆర్ తో శత్రుత్వం వల్ల బీజేపీ తమను టార్గెట్ చే్స్తుందని నమ్ముతున్నారు. ఈ అంశంపై పార్టీ నేతలకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ లేదా క్యాడర్ అత్యవసరంగా అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కావాలని అనుకున్నారు. సాయంత్రం మీటింగ్ ఉంటుందని చెప్పారు.. కానీ ఎలాంటి మీటింగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులపై కేసీఆర్ స్వయంగా తదుపరి ఏం చేద్దామన్న అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా సంకేతాలివ్వడం బీజేపీ పెద్దల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోందని చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలతో పోరాటం చేయడానికి సిద్ధమైతే.. తామూ సిద్ధమని బీజేపీ అనుకుంటోందని తాజా పరిణామాలతో వెల్లడవుతోందంటున్నారు. ముందు ముందు టీఆర్ఎస్ నేతలపై మరింత ఎక్కువగా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.