రాష్ట్రంలో రాజకీయ కదలికలు పుంజుకున్నాయి. ప్రతిపక్షాన్నీ, స్వపక్షాన్నీ డమ్మీ చేయగలమన్న ధీమాతో ఉన్న పాలకులను ఈ పరిణామం అప్రమత్తం చేసింది. అసంతృప్తి ఛాయలను అశ్రద్ధ చేయకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందుకనుగుణంగానే పావులు కదుపుతున్నది. మరోవైపు భవ్యిత్తులో అధికారం తమదేనని కాంగ్రెసు బింకాలు పలుకుతున్నది. టీఆర్స్ పాలనపై పెరిగే అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు విఫలయత్నం చేస్తున్నాయి. అధికారపక్షం మాత్రం ఏడాది ముందే ఎన్నికలు వస్తాయేమోనన్న అనుమానాలు బలపరిచే దిశలోనే అడుగులు వేస్తున్నది.
సాగునీరు పారేనా?
అభివృద్ధిలో తెలంగాణ మనదేశంలోనే నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పారు. ధనరాశులెటు పోతున్నాయో మాత్రం ప్రజలకు అంతుబట్టదు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ గానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లుగానీ బడ్జెటేతర నిధులతోనే పూర్తిచేస్తామన్నారు. అందువల్ల ప్రస్తుతానికి బడ్జెట్ మీద వీటి భారం లేదు. మరి ధనిక రాష్ట్రంలో ఆదాయం ఎటు ప్రవహిస్తున్నది? ఇప్పటికే అత్యధిక భాగం నిర్మాణం పూర్తిచేసుకుని, కొద్దిపాటి నిధులతో నీరు అందించే అవకాశం ఉన్న ప్రాజెక్టులను పక్కనబెట్టారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో సాగదీతతో బాటు అంచనా వ్యయాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రాజెక్టులన్నింటినీ వివాదాస్పదం చేసి, చిక్కుముడులు వేసి, తమవైఫల్యాలను ప్రతిపక్షాల మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నమేనన్న అభిప్రాయానికి ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది.
నియామకాలెప్పుడు?
నియామకాల మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న ఆందోళన యువతలో మొదలైంది. ప్రభుత్వం మీద నమ్మకంతో కోచింగ్ సెంటర్ల కోసం అప్పులు చేయాలో… లేక ఆందోళన బాట పట్టాలో తేల్చుకోలేని సందిగ్ధావస్థ. 2014 డిసెంబర్లో శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో లక్షా ఏడువేల ఖాళీ పోస్టులున్నాయనీ, రెండేండ్లలో భర్తీ చేస్తామనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ రెండేండ్ల కాలం గడిచింది. నియామకాలు ఆరువేలు దాటలేదు. పైగా ”గత ప్రభుత్వాలు ఎన్ని పోస్టులు నింపాయి?” అనీ, ”చదువుకున్నోళ్ళందరికీ గవర్నమెంటు ఉద్యోగాలు వస్తాయా?” అనే మాటలు ముఖ్యమంత్రి నోటినుండే రావటంతో యువత అవాక్కయ్యింది. డీఎస్సీలకు కూడా దిక్కులేని స్థితి ఏర్పడింది. నీళ్ళూ, నిధులూ, నియామకాలన్న నినాదాలిప్పుడు నీటి మూటలయ్యాయి.
సమస్యల చిట్టా పెద్దదే!
మిషన్ భగీరథ ద్వారా ఎన్నికలలోపు కొన్ని ప్రాంతాలకైనా నీళ్ళివ్వగలమన్న ధీమాతో పాలకులున్నారు. నీళ్ళు కొనుక్కోవాలన్న విషయం ఎన్నికల దాకా చెప్పకపోవచ్చు. ఎరవల్లిలో ఒక ఇల్లు, హైదరాబాద్‌లో ఒక కాలనీ చూపించి మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్లు దండుకున్న అనుభవం వీరికి భవిష్యత్తు మీద భరోసా పెంచింది. ప్రతి జిల్లాలో కొన్ని ఇండ్లు పునాదులు తీసి ఎన్నికల ముందు ఓట్లడిగే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. ఇవన్నీ కలిపినప్పటికీ పరిగేరుకున్నట్టే తప్ప పంట కోసుకున్నట్టుండదు కదా! రెండు లక్షలా అరవైవేల ఇండ్ల వాగ్దానం ముందు ఇవి ఒక లెక్కకాదు. దళితకుటుంబాలకు, గిరిజనులకు మూడెకరాల భూమి పట్టదు. ఎస్టీలు, మైనారిటీల రిజర్వేషన్ల వాగ్దానం తేలదు. రైతుల రుణమాఫీ వాగ్దానం పూర్తికాలేదు. కరువు సమస్య,పంటకు మద్దతు ధర పట్టదు. కందిరైతుల కన్నీటి వ్యధ పట్టించుకోలేదు. రైతుల మౌలిక సమస్యల పరిష్కారం వైపు ఆలోచనే లేదు. ఫీజుల రీయింబర్స్మెంట్ తేలలేదు. ప్రాజెక్టులకు భూసేకరణ పేరుతో రైతులను మోసం చేసి గుంజుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. జీఓ 123 నిలువదనే అనుమానంతో 2013 చట్టానికి తూట్లు పొడుస్తూ మరో బిల్లు శాసనసభలో ఆమోదించింది. దానికి రాష్ట్రపతి ఆమోదం లభించదేమోనన్న సందేహంతో జీఓ 38 విడుదల చేసింది. భూసేకరణ మీద హైకోర్టు విధించిన స్టే ఆర్డరు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తిమ్మిని బమ్మిని చేసైనా రైతుల భూమి గుంజుకోవాలన్న ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి చమరగీతం పాడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఓటు బ్యాంక్ రాజకీయం….!
పాలకులు వృత్తుల ప్రస్తావన చేయక తప్పటం లేదు. ఇందులో భాగంగానే వెనుకబడిన తరగతులలోని జనాధిక్య కులాలను చేరదీసే ప్రయత్నం మొదలైంది. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసంతృప్తులను సర్దుబాటు చేయటం కూడా మొదలైంది. పదవులు పంచిపెట్టటం ఆరంభమైంది.
రాజకీయ శూన్యం దిశగా…
రాష్ట్రంలో ప్రతిపక్షం జబ్బలు జారేసింది. కాంగ్రెస్, టీడీపీలు జవం జీవం లేక నిస్సారంగా ఉన్నాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ చావుదెబ్బ తిన్న కాంగ్రెసు కోలుకోలేదు. నాయకత్వ సమస్యతో కొటుమిట్టాడుతున్నది. టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు ప్రశ్నార్థకమే. చంద్రబాబునాయుడు ఏపీని నిలబెట్టుకునే తిప్పల్లో ఉన్నారు. ప్రజలలో ప్రారంభమైన అసంతృప్తిని కూడగట్టేందుకు ఈ రెండు పార్టీలూ ప్రయత్నిస్తున్నప్పటికీ పట్టుదొరికే జాడలేదు.
దిగ్విజరుసింగ్ సమక్షంలోనే బహిరంగ సభా వేదిక మీద కుమ్ములాటలు ప్రత్యక్షమయ్యాయి. జనావేదన సభలలో జనావేదన కంటే కాంగ్రెసు ఆవేదనే ముందుకొస్తున్నది. దేశంలో సమస్యలకు మూలమైన కాంగ్రెసు తన విధానాలను పునరాలోచించు కుంటుందనుకోవటం భ్రమ. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెరిగే అసంతృప్తి ఆటోమేటిక్‌గా కాంగ్రెసుకే ఉపయోగపడు తుందనీ, వచ్చిన అసంతృప్తిని సొమ్ము చేసుకుంటే చాలుననే అవకాశవాదమే తప్ప ప్రజానుకూల విధానాల గురించి కాంగ్రెసులో వెతకటం నేతిబీరకాయలో నెయ్యి వెతకటమే! రాష్ట్ర ముఖ్యమంత్రి కీలకమైన తన ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ మోడీతో సంప్రదించి, అవగాహనతోనే నడుచుకుంటున్నారనటంతో రాష్ట్ర బీజేపీ నేతల మెత్తబడుతున్నారు. మొక్కుబడి నిరసనలతో కాలం గడుపుతున్నారు. చాపకింద నీరులాగా మతరాజకీయాల మీదనే దృష్టిసారించారు. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో కొంత రాజకీయ శూన్యత మొదలవుతున్నది. ఈశూన్యతను నింపేది ఎవరన్నదే ప్రశ్న.
కోదండరామ్ ప్రయాణం ఎటు?
తెలంగాణ కోసం పోరాడిన రాజకీయ జేఏసీ ఛైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని జేఏసీ ఇప్పుడు ప్రజా సమస్యల మీద కదలటం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. కానీ అసంతృప్తి చెందిన ప్రజలు కోదండరామ్ వెనుక సమీకృతమవుతారా అన్నది పరిశీలించాలి. రాష్ట్రంలో ఆయన పర్యటనలకు ఆదరణ ఉన్నది. నిరుద్యోగ యువత ప్రదర్శనకు పిలుపునివ్వటంతో రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. కానీ ఆయనను అరెస్టు చేసిన తర్వాత జిల్లాల నుండి వేలాదిగా యువత తరలివస్తుందనుకున్న వారి అంచనాలు తలకిందు లయ్యాయి. ఇందుకు కారణాలు పరిశీలించాలి. అసంతృప్తి మోతాదు గురించి అంచనాకో, యంత్రాంగం పరిమితులకో దీనిని పరిమితం చేసి చూడలేము. కోదండరామ్ చిత్తశుద్ధిమీద పాలకపక్షం దాడిచేస్తున్నది. కాంగ్రెసు ఏజెంటుగా ముద్రవేస్తున్నది. ఈ రాజకీయ ఆరోపణనను నిర్ద్వందంగా ఖండించకుండా ప్రజల విశ్వాసం చూరగొనటం సులువు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసుతో జతకట్టబోనని కోదండరామ్ స్పష్టంగా ప్రకటించటం ద్వారానే యువతను ఆకర్షించగలరు. ప్రత్యామ్నాయ విధానాల ప్రణాళిక సాధన కోసం జరిగే ప్రజా ఉద్యమం నూతన రాజకీయ సమీకరణలకు దారితీయవచ్చు. రాజకీయ శూన్యాన్ని పూరించి, ప్రజల జీవితాలకు భరోసా ఇచ్చే మార్గం ఇదే!
Mahesh Beeravelly