ఆలూలేదు… చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న సామెత చందంగా ఉన్నది అధికార తెరాస పార్టీ తీరు! ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికల విషయంలో ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు… నామినేషన్లు కూడా పడలేదు.. తుమ్మల గెలవడం కూడా జరగలేదు.. అయినా సరే.. ఆ తర్వాతి పరిణామాల గురించి.. అధికార పదవులను పంచుకోవడం గురించి.. తెరాస నాయకులు ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తుమ్మల ఎటూ ఎమ్మెల్యేగా గెలవడం గ్యారంటీ గనుక.. ఆయన ఖాళీ చేయబోయే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరు దక్కించుకోవాలా అనే విషయంలో ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షులు బుడాన్ బేగ్ను శాసన మండలికి పార్టీ తరఫున పంపాలని తెరాస ఇప్పుడే ఫైనలైజ్ చేసేసుకోవడం తమాషా!
పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి.. తెరాస అందరికంటె ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించి.. ముందంజలో ఉంది. కాంగ్రెసు రాంరెడ్డి సుచరిత పేరును ఖరారుచేసినట్లే. తెలుగుదేశంలో నామా నాగేశ్వరరావు పేరు ఒక్కటే వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈలోగా తెరాస మాత్రం తాము అప్పుడే పాలేరును గెలుచుకున్నట్లే భావిస్తున్నది.
పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించి ఎమ్మెల్యే అయితే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారు గనుక.. ఆ ఏర్పడబోయే ఖాళీలో ఎవరిని మండలికి పంపాలనే నిర్ణయం అప్పుడే తెరాసలో ఫైనలైజ్ అయిపోయింది. గతంలో ఖమ్మం ఎంపీగా తెరాస తరఫున పోటీచేసి.. ఓడిపోయిన బుడాన్ బేగ్కు ఎమ్మెల్సీ స్థానాన్ని ఖరారుచేసేసుకున్నారు. ఆ ఖాళీని ఎమ్మెల్యేల కోటాలోనే భర్తీ చేయాల్సి ఉంటుంది గనుక.. మళ్లీ ఖమ్మం జిల్లాకే ఆ అవకాశం ఇచ్చేలా చేయాలనుకుంటున్నారు. అధికార తెరాస పార్టీ ఇటీవలి కాలంలో ఏ ఎన్నికల్లో అయినా సాధిస్తున్న విజయ పరంపర, ప్రస్తుతం పాలేరులో ఏకంగా జిల్లాలో బలం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రంగంలోకి దిగుతూ ఉండడం అంతా వారికే అనుకూలంగా ఉన్న మాట వాస్తవమే కావొచ్చు. కానీ, అప్పుడే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా పంచేసుకోవడంలో ఆత్మవిశ్వాసం జోరు కాస్త పెరిగినట్లు కనిపిస్తున్నదని పలువురు అనుకుంటున్నారు.