వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటునప్పటికీ ఎన్నడూ తెలంగాణాలో అడుగుపెట్టలేదు కానీ వరంగల్ ఉపఎన్నికలలో మూడు రోజుల పాటు స్వయంగా ప్రచారం చేసారు. ఆయన కంటే ముందుగా, చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా వచ్చి ప్రచారం చేసారు. వారు తెలంగాణా ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు చేసారు. కానీ తెరాస నేతలెవరికీ అది తప్పుగా అనిపించ లేదు. ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అలాగే డిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, బీజేపీ తరపున పురందేశ్వరి, కేంద్రమంత్రులు రాదా మోహన్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికలలో ప్రచారం చేసినా తెరాస నేతలెవరికీ అభ్యంతరం ఉండదు. కానీ తెలంగాణాలో కూడా తెదేపా ఉన్నపుడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేస్తే మాత్రం వారికి తప్పుగా కనిపిస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు.
“ఆంధ్రా ముఖ్యమంత్రికి ఇక్కడ ఏమి పని?’ కేసీఆర్ అంటే, “అమరావతికి నిధులు తెచ్చుకోలేని వ్యక్తి హైదరాబాద్ అభివృద్ధికి ఏవిధంగా తెస్తారని” మంత్రి కె.టి.ఆర్. ప్రశ్నిస్తారు. మాజీ తెదేపా సభ్యుడు, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మరో అడుగు ముందుకు వేసి ‘ఒక ఊరికి రాజు మరొక ఊరికి తలారి’ అని సామెతలు కోట్ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం చాలా సహజమే. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేసినప్పుడే తెరాస నేతలు అందరూ ఉలిక్కిపడుతూ ఆయనపై మూకుమ్మడిగా దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనపై వారు చాలా గొప్పగా దాడి చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, తద్వారా ఆయనను తెలంగాణా గడ్డపై చూసి వారందరూ తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారనే భావం ప్రజలకు కల్పిస్తున్నారు. వారిలో అటువంటి అభద్రతా భావమే లేకుంటే మిగిలిన పార్టీల నేతలలాగే ఆయనను పట్టించుకోకుండా ఉండేవారు కదా?
తెలంగాణాలో తెరాసకు మరొక పార్టీ నుంచి పోటీయే ఉండకుండా ‘రాజరిక పరిపాలన’ చేయాలని తహతహలాడుతున్నప్పుడు దానికి తెదేపా సవాలు విసురుతుంటే జీర్ణించుకోవడం కష్టమే. అదే కారణం చేత ఇంత కాలం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణలు జరిగేవి. కానీ చంద్రబాబు నాయుడు విజయవాడకి తరలిపోయిన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నేతల వైఖరిలో చాలా మార్పు రావడం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రాకే పరిమితమయి ఉంటే వారికి ఆయనతో ఎటువంటి సమస్యలు ఉండవు…కనబడవు. కానీ తెలంగాణాలో అడుగుపెడితే అందరికీ అభ్యంతరమే.