సరిగ్గా పదిహేనేళ్ల క్రితం… 2001 ఏప్రిల్ 27న ఓ సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించింది. ఉద్యమపార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, అధికార పార్టీ హోదాలో ఖమ్మంలో ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తోంది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మంను వేదికగా నిర్ణయం వ్యూహాత్మకమా లేక కాకతాళీయమా అనేది వేరే విషయం. తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికలోనూ విజయాలే. హైదరాబాద్ – రంగారెడ్డి పట్టభద్రుల నియోజకకవర్గం, నల్గొండ, పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే కారుజోరుకు బ్రేక్ పడింది.
గ్రేటర్ హైదరాబాద్, ఆ తర్వాత వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస జైత్రయాత్ర కొనసాగింది. రెబెల్స్ కొంత మంది జలక్ ఇచ్చినా, సిద్దిపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఏ రకంగా చూసినా అన్నీ మంచి శకునములే. అయినా ఏదో తెలియని భయం తెరాసను వెంటాడుతుందేమో అనే అభిప్రాయం కలుగుతుంది. సంపూర్ణ మెజారిటీ ఉన్నా వలసలను భారీగా ప్రోత్సహించడమే దీనికి కారణం.
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ లేకుండా చేయాలనేది తెరాస పంతం అనేది ఇప్పటికే స్పష్టమైంది. పనిలో పనిగా వీలైనంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేయడానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. మంది ఎక్కువైతే రేపు ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే అనుమానాలున్నాయి. 2019 ఎన్నికల్లో కొత్త వారికి, పాత వారికి టికెట్ల కేటాయింపులో న్యాయం చేయడం కత్తిమీద సామే అవుతుంది. ఆలోగా నియోజకవర్గాల పెంపు పూర్తవుతుందనే గ్యారంటీ లేదు.
ఇంతకీ తనకున్న మెజారిటీ మీద తెరాస అధినేతనకు నమ్మకం లేదా? అనుకోని ఆటంకాలు ఎదురవుతాయేమో అని అనుమానిస్తున్నారా? ఊహించని ఉపద్రవం ముంచుకు రావచ్చని భావిస్తున్నారా? అందుకే ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారా? ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇలా స్కెచ్ వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆపరేషన్ ఆకర్షలో నిబంధనలను, నైతిక విలువలను పాటించడం లేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించే ముందు రాజీనామా చేయాలనే నైతికమైన అంశాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ఆయన పట్టించుకోవడం లేదు. వీలైనంత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే, ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారేమో అంటున్నారు పరిశీలకులు.
బంగారు తెలంగాణ సాధనలో భాగంగా భారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తెరాస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ట్రంప్ కార్డుగా మారింది. అయితే హైదరాబాదులో మినహా మరెక్కడా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అయినా సరే, ఏదో ఒక రోజు కేసీఆర్ సర్కార్ పక్కాఇళ్లను నిర్మించి ఇస్తుందని పేద ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం విషయంలో తెలంగాణ మంచి జోరు మీదుంది. ఏరకంగా చూసినా సానుకూల వాతావరణమే ఉందని గులాబీ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆపరేషన్ ఆకర్షపై ఇంతగా ఫోకస్ పెట్టడమే ఆశ్చర్యకరం. చివరకు వైసీపీ సభ్యులకు కూడా గలం వేశారు. ఇక మిగిలింది మజ్లిస్, బీజేపీ సభ్యులు మాత్రమే. అయితే వాళ్లు వచ్చే అవకాశం లేదు. ఆకర్షించడానికి తెరాస ప్రయత్నించే అవకాశం కూడా కనిపించడం లేదు. మొత్తానికి టీడీపీ, కాంగ్రెస్ లను భారీగా దెబ్బతీయాలనే ప్రయత్నం బూమరాంగ్ అవుతుందేమో! వచ్చే ఎన్నికల్లో పాత, కొత్త నేతల సంఘర్షణ అధినేతకు సవాలుగా మారితే కొత్త చిక్కులు తప్పక పోవచ్చు.