బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే ఆ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. నలుగురు హైదరాబాద్ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కండువా కప్పేసింది. కేటీఆర్ సమక్షంలో నలుగురు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కూడా కారెక్కారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ చేరారు.
ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ వెళ్లారు. మోదీతో మాట్లాడి వచ్చారు. ఇప్పుడు మోదీ హైదరాబాద్ రానున్న సమయంలో వారిలో నలుగురు పార్టీ మారిపోయారు. ఓ వైపు దేశం మొత్తం ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరడమే కాదు.. బీజేపీ నేతలు ఇతర పార్టీల్లో చేరే కార్యక్రమాలు జరగడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం సీన్ మార్చేస్తున్నారు. నిజానికి బీజేపీ నుంచి చేర్చుకోవడానికి ఎమ్మెల్యేలు లేరు. ముగ్గురుంటే వారిలో ఇద్దరు టీఆర్ఎస్ నుంచి వెళ్లి ..బీజేపీలో చేరినవారే. ఇంకొకరిది హిందూత్వ కేటగిరి. బీజేపీలో చెప్పుకోదగిన నేతలు కార్పొరేటర్లే.
సీనియర్ నేతలు ఎవరూ పార్టీ మారరు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే షాక్ ఇవ్వాలనుకున్న టీఆర్ఎస్ ఆ మేరకు షాక్ ఇచ్చింది. అయితే బీజేపీ దృష్టి పెడితే… ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు.. ఇప్పుడు నలుగురు కార్పొరేటర్లేనని.. తాము తల్చుకుంటే ఎమ్మెల్యేలు అవుతారని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా బీజేపీని రెచ్చగొడుతున్నారని వారంటున్నారు.