మునుగోడు ఉపఎన్నికలో గెలుపు క్రెడిట్‌ను టీఆర్ఎస్.. కమ్యూనిస్టులకు ఇచ్చేసింది. కమ్యూనిస్టుల వల్లే తాము గెలిచామని మునుగోడు ఎలక్షన్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టారు. సీపీఎం కార్యాలయానికి వెళ్లి ధన్యవాదాిలు తెలిపారు. వామపక్షాలు తమ పార్టీకి మద్దతు ఇవ్వడమే గాక ప్రచారంలోనూ బాగా పనిచేశాయని కితాబిచ్చారు. బీజేపీ కుట్రలను జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలనే వ్యూహంలో భాగంగానే వామపక్షాలు తమకు అండగా నిలిచాయని చెప్పారు.
టీఆర్ఎస్ విధానం ప్రకారం.. నిన్నా మొన్నటి వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు. ఒంటరిగా పోటీ చేస్తుంది. అందుకే ఎప్పుడు పొత్తుల ప్రస్తావన వచ్చినా కేటీఆర్ .. ప్రజలతోనే తమకు పొత్తు ఉంటుందని చెబుతూ వస్తూంటారు. కానీ మునుగోడు ఉపఎన్నికకు మాత్రం పూర్తిగా వ్యూహం మార్చారు. కమ్యూనిస్టులకు కలుపుకున్నారు. ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటమే దీనికి కారణం.
కేసీఆర్ వ్యూహం వర్కవుట్ అయింది పది వేల ఓట్లకు కాస్త ఎక్కువ తేడాతో టీఆర్ఎస్ విజయం సాధించింది. కమ్యూనిస్టులు .. నిబద్ధతతో ఉంటారు. వారి ఓటర్లకు పార్టీ ఆదేశమే కీలకం. అందుకే వారితో పొత్తులు పెట్టుకున్న పార్టీకి ఖచ్చితంగా వారి ఓట్లు బదిలీ అవుతాయన్న నమ్మకం ఉంటుంది. ఆ ఫలితాన్ని టీఆర్ఎస్ సాదించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనూా ఇప్పుడు ఆ పార్టీలతో పొత్తులు కొనసాగించాల్సి ఉంది. వారికి కనీసం చెరో రెండు, మూడు సీట్లు అయినా ఇవ్వకపోతే.. మిత్రద్రోహం చేసినట్లవుతుంది. పైగా జాతీయ రాజకీయాల్లోనూ కమ్యూనిస్టుల మద్దతు కోరుకుంటున్నారు. అందుకే.. టీఆర్ఎస్ ఇక పొత్తుల రాజకీయంలో మునిగిపోయినట్లే అనుకోవచ్చు.