చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అనే సామెత.. ఫిరాయిపుల చట్టం విషయంలో కాంగ్రెస్ పార్టీకి చక్కగా వర్తిస్తుంది. ఆ చట్టం చేసినప్పుడు… స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి పెట్టడమో.. లేకపోతే.. పార్టీ ఫిరాయించినప్పుడు ఆటోమేటిక్‌గా పదవి కోల్పోయే నిబంధన పెట్టడమో చేయాలని…అనేక సూచనలు వచ్చాయి. కానీ… చట్టం మొత్తం చేసి..అంతిమంగా స్పీకర్ చేతిలో అధికారం పెట్టారు. దానికి కారణం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఎక్కువగా ఉన్నాయి. స్పీకర్ అంటే… పార్టీ పరంగా వ్యవహరించే వ్యక్తి అనే ముద్ర పడిపోవడం అప్పట్నుంచే ప్రారంభమయింది. వైఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులతో.. అప్పటి స్పీకర్లు వ్యవహరించిన తీరు ఇప్పటికీ వివాదాస్పదమే. చట్టాన్ని అలా చుట్టంగా మార్చుకున్నారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్కు అవకాశం వచ్చింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డి, కొండా మురళి, రాములునాయక్‌లకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ బుధవారం నోటీసులు జారీ చేశారు. టీఆర్ఎస్ నుంచి ఇలా ఫిర్యాదు అందగానే అలా నోటీసులు పంపారు. అదే సమయంలో.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డికి ఎలాంటి నోటీసులులేవు. ఫిర్యాదు చేస్తే అయినా ఇస్తారేమోనని.. కాంగ్రెస్ నేతలు మండలి కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ వాటిని తీసుకునేవాళ్లెవరూ కనిపించలేదు. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ మేము రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేసినా మండలి చైర్మన్ స్పందించలేదు. కానీ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రం వెంటనే స్పందించి నోటీసులు జారీ చేశారు.
దాంతో ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ నేతలకో మాకో చట్టం, టీఆర్ఎ్సకో చట్టమా? అని ఆవేదన చెందుతున్నారు. 2014, 2015లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ చేర్చుకుందని, దానిపై ఫిర్యాదు చేసినా మండలి చైర్మన్ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కానీ కేసీఆర్ చెప్పిన 24 గంటల్లోనే కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో వారు చూపించిన దారే కదా.. అని.. వీరి ఆవేదనను ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు.