ఇంతకు ముందు ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడిని, అతని పార్టీ నేతలని, ప్రభుత్వాన్ని కూడా తీవ్ర సంకట స్థితిలో పడేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ ఎత్తులు వేయడంలో గురువును మించిన శిష్యుడు అని నిరూపించుకొన్నారు. కానీ ఎంతయినా గురువు గురువే శిష్యుడు శిష్యుడే! అందుకే కేసీఆర్ దిమ్మ తిరిగిపోయేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టి చంద్రబాబు తన మీద ఈగకూడా వాలకుండా చేసుకొన్నారు. ‘చంద్రబాబుని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని’ చెప్పిన వారందరూ ఇప్పుడు ‘చట్టం తనపని తాను చేసుకుపోతుందని’ పడికట్టు పదాలతో తమ నిస్సహాయాతని, అసమర్ధతని కప్పిపుచ్చుకొంటున్నారు.
ఇంతకు ముందు తెరాస ప్రభుత్వం తెదేపా ప్రభుత్వంతో ఒక ఆట ఆడుకొంటే, ఇప్పుడు తెదేపా ప్రభుత్వం వంతు వచ్చినట్లుంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు కేసీఆర్ లాగ అత్యుత్సాహం ప్రదర్శించకుండా, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి తను కానీ, తన మంత్రులు గానీ మాట్లాడకుండా జాగ్రత్తపడుతూనే ఈకేసుని చాలా జాగ్రత్తగా ముందుకు నడుపుతున్నట్లున్నారు. తద్వారా ‘చట్టం తన పని చేసుకుపోతుంది’ అన్నట్లుగానే పైకి కనిపిస్తుంది, కానీ కేసు మాత్రం చంద్రబాబు మాటల్లోనే చెప్పాలంటే ‘ఒక పద్దతి ప్రకారమే’ ముందుకు సాగుతోంది.
సిట్ అధికారుల అభ్యర్ధన మేరకు విజయవాడ మేజిస్త్రేట్ కోర్టు హైదరాబాద్ లోని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను కాల్ డాటా ఇమ్మని ఆదేశించడం, వారు మొదట నిరాకరించడం, ఆనక వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, కాల్ డాటాని సీల్డ్ కవర్లో ఉంచి విజయవాడ కోర్టుకి అందించమని సుప్రీం వారిని ఆదేశించడం, ఆ సందర్భంగా వారు తమను తెలంగాణా ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించిందనే విషయం బయటపెట్టడం, కాల్ డాటా ఎవరికయినా ఇస్తే ప్రాసిక్యూషన్ చేస్తానని బెదిరించిందనే విషయం బయటపెట్టడం వంటివి అన్నీ కూడా తెలంగాణా ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతల, మంత్రుల చేస్తున్న ఆరోపణలకు, వాదనలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. కానీ ఈ ప్రక్రియలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు ‘సిట్’ ఏర్పాటు చేయడం తప్ప మరెక్కడా కూడా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమేయం లేదు. కానీ, ఆ సిట్ ఏర్పాటు చేయడంతోనే ఇవ్వన్నీ సాధ్యమయ్యాయనే విషయం అర్ధమవుతోంది.
“మరికొద్ది సేపట్లో ఒక సంచలమయిన వార్త వినబోతున్నారు” అంటూ స్టింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో మొదలయిన తెరాస నేతల ప్రకటనలు చంద్రబాబుకి ఏ శిక్ష పడబోతుందో కూడా నిర్ధారించే వరకు కూడా సాగిపోయి, చివరికి ఏమీ చేయలేక నవ్వులపాలయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలున్నాయని ప్రకటించి వాళ్ళని నియంత్రించడమే కాకుండా, ఎక్కడా వాటి వివరాలను బయటపెట్టకుండా చాలా గుంభనంగా వ్యవహరిస్తూ, ఒక పద్ధతి ప్రకారం పావులు కదుపుతూ చివరికి తమ ఫోన్లను తెలంగాణా ప్రభుత్వమే ట్యాపింగ్ చేయించిన సంగతి సర్వీస్ ప్రొవైడర్ల నోటితోనే ఏకంగా సుప్రీం కోర్టులోనే బయటపెట్టించారు.
ఇప్పుడు మళ్ళీ ఆ కాల్ డాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయవద్దని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించమని కోరుతూ తెలంగాణా ప్రభుత్వమే స్వయంగా హైకోర్టులో ఒక పిటిషను వేయడంతో, దాని నోటితోనే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనే వాస్తవాన్ని ద్రువీకరింపజేసినట్లయింది. తెలంగాణా ప్రభుత్వం టెలీఫోన్ ట్యాపింగ్ చేయకపోయుంటే సర్వీస్ ప్రొవైడర్లను బెరించనవసరమూ లేదు…మళ్ళీ ఇప్పుడు వారిని కాల్ డాటా విజయవాడ కోర్టుకి ఇవ్వనీయవద్దని హైకోర్టులో పిటిషను వేసే అవసరమూ కూడా లేదు. కానీ ఆ రెండు పనులు కూడా చేసింది అంటేనే తప్పు చేసిందని స్పష్టమవుతోంది.
తెలంగాణా ప్రభుత్వం వేసిన ఆ పిటిషన్ని ఈరోజు హైకోర్టు విచారిస్తోంది. చాలా ఆసక్తికరమయిన, ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వం తరపున సుప్రసిద్ధ లాయర్ రాం జెట్మలానీ వాదిస్తున్నారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరూ లేరక్కడ.
ఈవిధంగా చంద్రబాబు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ ఎక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరుగా జోక్యం చేసుకోకుండానే కధని ముందుకు నడుపుతున్నారు. కానీ ఆ కధ ఎంతవరకు నడపాలో దానిలో ఎక్కడ కామాలు, ఫుల్ స్టాపులు పెట్టాలో చంద్రబాబుకి బాగా తెలుసు. కనుక ఓటుకి నోటు కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అలాగా మరికొన్ని రోజులు సాగుతూనే ఉంటాయి. కానీ ఏదో ఒకరోజు అటకెక్కిపోవచ్చును. కానీ పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచినట్లు ఈ కేసులు కూడా అటక మీద చాలా భద్రంగానే ఉంటాయి. అవసరమయినప్పుడు వాటిని క్రిందకు దించివాడుకొని మళ్ళీ పైనపెట్టేయవచ్చును. అంతే వాటి ఉపయోగం!