భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ చేస్తున్న వడ్ల పోరాటంలో తీర్మానాల దశ వచ్చింది. పంచాయతీల దగ్గర్నుంచి మున్సిపాల్టీల వరకూ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇందు కోసం తేదీలను ఖరారు చేశారు. తెలంగాణలో పండే ధాన్యమంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 27న మండల పరిషత్, 28న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, 29న డీసీసీబీ, డీసీఎంఎస్, 30న జిల్లా పరిషత్, 31న మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేయనున్నారు.
పంజాబ్ మాదిరిగా రెండుపంటలు నూరుశాతం ధాన్యంను ఎంఎస్పీకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తారు. ఆ తర్వాత వాటిని కొరియర్ లేక పోస్టుల ద్వారా ప్రధాని మోదీ కార్యాలయానికి పంపుతారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. వడ్ల పోరాటంలో భాగంగా టీఆర్ఎస్ తీర్మానాల వ్యూహం ఎంచుకుంది.త ఇటీవల అసెంబ్లీలో చేసిన ఎస్టీ రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రం అసలు తమకు అందలేదని చెప్పేసింది.
ఇప్పుడు వడ్ల విషయంలో పంచాయతీలు.. మున్సిపాల్టీల తీర్మానాలను పట్టించుకుంటుందా అంటే.. ఆలోచించాల్సిన విషయమే. కానీ తాము ప్రజాభిప్రాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. వారు స్పందించలేదు కాబట్టే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నామని చెప్పుకోవడానికి ఈ తీర్మానాలు పనికి వస్తాయి. ఈ తీర్మానాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు సానుకూలంగా స్పందించే అవకాశం లేదు.