ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉద్ధృతం కాబోతోంది. రాజకీయ పార్టీల మద్దతును కూడా కార్మికులు కూడగట్టారు. ఈ క్రమంలో నేటి నుంచి వరుసగా ఓ ఐదు రోజులపాటు అన్ని జిల్లాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా భాజపా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వల్ల కీలక కాంగ్రెస్ నేతలు కొందరు నేరుగా ఆర్టీసీ అంశం మాట్లాడలేకపోతున్నా, ఆ పార్టీ కూడా మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి, అధికార పార్టీ తెరాసకు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ సంఘటితమైన పరిస్థితి వచ్చింది. గడచిన వారం రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ. కఠినంగా ఉంటే కార్మికులు దార్లోకి వచ్చేస్తారనే సీఎం కేసీఆర్ అంచనా తప్పినట్టుగా కనిపిస్తోంది!
సమ్మె ప్రారంభమై వారం రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి పట్టువిడుపు ధోరణి కనిపించడం లేదు. దసరా ముందురోజున ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో త్రిసభ్య కమిటీ వేశారు. దాన్ని కార్మికులు లెక్క చెయ్యలేదు. కొన్ని షరతులకు అంగీకరిద్దామనే ధోరణిలో ప్రభుత్వం రాయబార ప్రయత్నాలు చేసినా, ప్రధాన డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టడంపై ప్రభుత్వం మరింత మొండి వైఖరి ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఓరకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లనే సమ్మె తీవ్రతరమైందని చెప్పొచ్చు. పరిస్థితి ఇంత క్లిష్టంగా కనిపిస్తున్నా… ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి దిద్దుబాటు చర్యలంటూ ఏవీ కనిపించడం లేదు. అదే మొండితనాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉంది! ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేటు బస్సుల్ని తిప్పుతున్నామనీ, ఉద్యోగులను నియమించుకుంటున్నామనీ మాత్రమే చెబుతోంది. అంతేతప్ప, ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలేవీ ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా కనిపించడం లేదు.
సమ్మె అంశం ఇప్పుడు కేవలం అధికారులకు మాత్రమే పరిమితమైనట్టుగా కనిపిస్తోంది. అధికార పార్టీ తెరాస ఫోకస్ అంతా హుజూర్ నగర్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది. అంటే, మరో పదిరోజులపాటు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తరఫు నుంచి యథాస్థితి కొనసాగే వాతావరణం కనిపిస్తోంది. కానీ, ఈలోగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు కూడా రోడ్డు మీదికి వచ్చేస్తున్నాయి. శుక్రవారంనాడు కార్మికుల కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా మౌన ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఇంత జరుగుతున్నా రాజీ ప్రయత్నాలుగానీ, చర్చలుగానీ, సమ్మె విరమణకు దోహదం చేసే ప్రయత్నాలేవీ ప్రభుత్వం నుంచి కనిపించడం లేదు!