తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ లను అసెంబ్లీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. ఇద్దరి బహిష్కరణలను తిరస్కరిస్తూ, ఎమ్మెల్యేలుగా వారిని కొనసాగించాలంటూ కోర్టు ఆదేశించడం విశేషం. సభలో మండలి ఛైర్మన్ పై మైకు విసిరి, గందరగోళం చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో కేసీఆర్ సర్కారు తీరు సరిగా లేకపోవడంతోనే కాంగ్రెస్ కు అనుకూలమైన తీర్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఆదేశించినట్టు ఘటనకు సంబంధించిన వీడియో టేపులను ప్రభుత్వం సమర్పించలేకపోయింది. ఈ విషయంలో కొంత మొండి వైఖరి అవలంభించింది. ఇదే సమయంలో అడ్వొకేట్ జనరల్ రాజీనామా చేసిన సంగతీ తెలిసిందే.
అయితే, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ స్వీకరించి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానిస్తారా లేదా అనేది చర్చనీయం కాబోతోంది. ఎందుకంటే, అసెంబ్లీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ. ఇప్పటికే ఈ ఇద్దరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల భవిష్కరణ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి పంపించేశారు. ఉప ఎన్నికలకు సిద్ధమనే వాతావరణం కూడా తెరాసలో నెలకొంది. అంతేకాదు, ఈ కాంగ్రెస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో భారీ బహిరంగ సభలకు కూడా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేశారనీ కథనాలు వినిపించాయి. అంటే, త్వరలో ఉప ఎన్నికలు తప్పవు అనే ప్రిపరేషన్ లో తెరాస తలమునకలైనట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఇలా కాంగ్రెస్ అనుకూలంగా రావడం తెరాసకు కొంత మింగుడుపడని పరిణామంగానే చూడాలి.
సాధారణ ఎన్నికల కంటే ముందుగానే ఏపీలో నంద్యాల తరహా ఉప ఎన్నికను కేసీఆర్ ఆశించారు. ఎందుకంటే, 2019లోపుగానే ఒకట్రెండు స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్లి గెలవడం ద్వారా… కాంగ్రెస్ ను తాము సమర్థంగా ఎదుర్కోబోతున్నామనే ప్రచారం చేసుకోవచ్చని భావించారు. ఎలాగూ సందర్భం కలిసొచ్చింది కాబట్టి… కాంగ్రెస్ కు బలమైన ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వెళ్లి గెలిస్తే, మరింత బలం పుంజుకున్నామనీ చాటి చెప్పుకోవచ్చు అనుకున్నారు! సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్ తో జత కలిసే దిశగా ప్రస్తుత పరిణామాలు ఒక రూపం దాల్చబోతున్నట్టున్నాయి. కాబట్టి, ఆ శక్తులేవీ ఏకం కాకముందే ఉప ఎన్నికలకు వెళ్లి, విజయం సాధించడం ద్వారా అలాంటి కూటమి ఏర్పాటు ఆలోచనల్ని ప్రాథమిక స్థాయిలోనే డోలాయమానంలో పడేయ్యొచ్చని కేసీఆర్ భావించారనీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ వ్యూహమంతా కోర్టు తీర్పుతో మొత్తంగా గల్లంతైందని చెప్పుకోవాలి.