స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతీ సారి చట్టాలు మార్చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు మున్సిపల్ చట్టాన్ని మార్చారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమూ చట్టాల్ని మార్చాలనుకుంటున్నారు. ఇందుకోస ప్రత్యేకంగా అసెంబ్లీని కూడా సమావేశపర్చాలని అనుకుంటున్నారు. అక్టోబర్ 13న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను, 14న కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ చివరి వారంలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఇదివరకే పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ తో ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల కోసం జిహెహెచ్ఎంసి చట్టంలోసవరణలు చేయాల్సి ఉంది. ప్రధానంగా హైకోర్టు సూచించిన కోన్ని మార్పులతో చట్టం రానుంది. మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను జీహెచ్ఎంసీ చట్టంలో ఉంచనున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ విధుల్లో మార్చులు చేయనున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనలు కూడా తొలగించనున్నారు.
మున్సిపల్ చట్టం స్ఫూర్తిగా..నూతన జీహెచ్ఎంసీ చట్టం తీసుకురాబోతున్నట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మున్సిపల్ చట్టంలోని కీలక అంశాలను జీహెచ్ఎంసీ నూతన చట్టంలో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ అనుమతులు, శానిటేషన్, గ్రీనరీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పౌరులకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా చట్టంలో సవరణలు చేస్తున్నట్లు అధికార పక్షం చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎల్ ఆర్ ఎస్ పైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో వ్యతిరేక పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరణి విషయంలో కూడా సర్కార్ చట్ట బద్దత కల్పించే చర్యలు తీసుకోనుంది. రెవెన్యూ సంస్కరణ విషయంలో మరిన్న సులభతరమైన నిర్ణయాలు తీసుకేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.