ఏనాడూ సచివాలయానికి రాని ఈనాడు అధినేత రామోజీరావు 2015 ఏప్రిల్13న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను స్వయంగా వచ్చి కలుసుకోవడం అప్పట్లో పెద్ద వార్త అయింది. తాను తలపెట్టిన ఆధ్యాత్మిక నగరం ఆల్బమ్ చూపించేందుకు వెళ్లారన్నది అప్పట్లో వెలువడిన కథనం. దానికి ముందే 2014 డిసెంబర్ 12న కెసిఆర్ రామోజీ ఫిలిం సిటీని సందర్శించడం, గంటల తరబడి అక్కడే ఉండి ప్రశంసలతో ముంచెత్తడం కూడా మామూలు స్థాయిని మించి పోయింది. దీనివెనుక బలమైన కారణం ఉందని తెలుగు 360 అప్పట్లోనే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన రామోజీరావు ఆయన కంటే కూడా కెసిఆర్ సర్కార్‌ను ఎక్కువగా వెనకేసుకురావడంలోనూ ఇదే పనిచేస్తున్నట్లు మీడియా వర్గాలు చెప్పుకుంటూనే ఉన్నాయి. ఒకప్పుడు పత్రికలు అంటేనే ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూక్తులు చెప్పడమేకాక, మేము కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తామని, కోర్టుకు కూడా లిఖితపూర్వకంగా తెలియజేశారు రామోజీ. అలాంటి ‘ఈనాడు’ ఇప్పుడు అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలను ఆకాశానికెత్తడమే ఏకైక కార్యక్రమంగా చేసుకోవడంతో ఆ పత్రిక పదును కూడా తగ్గి చప్పబడిపోయిందనే అభిప్రాయం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో 295 ఎకరాల భూమిని ఫిలిం సిటీకి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం బదలాయించటంతో ఒక సందేహం తీరిపోయినట్లే. దీనికి సంబంధించి 37 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ భూముల యజమానులకు పరిహారం ఇస్తారట. మరో 81 ఎకరాలు అప్పగించడానికి కూడా ప్రభుత్వం సుముఖంగానే వుంది. ఫిలింసిటీ యాజమాన్యం కోరడమే తరువాయి. ఈ తతంగం రెవెన్యూ శాఖ ద్వారా నడిపించి పర్యాటక శాఖ ద్వారా ఇప్పించడం జరుగుతున్నది. దీనిపై చాలా వివరాలు ఆంధ్రజ్యోతి ఇచ్చింది. రాజకీయాలు ఎలా వున్నా ఈనాడుకు సంబంధించిన అంశాలు బయిటపెట్టడంలో ఈ పత్రిక చాలా చురుగ్గా పనిచేస్తుంటుందని అందరికీ తెలుసు. ఈ భూముల విలువ లెక్కకట్టడంలో అనుసరించిన పద్ధతులను కూడా వివరంగా ఇచ్చింది. అయితే కొన్ని బంధనాల వల్ల వార్తను ఎలాటి వ్యాఖ్య విశ్లేషణ లేకుండా ప్రచురించింది.
రామోజీ ఫిలిం సిటీ ఇప్పుడు పెద్దాయనకు ప్రధాన వ్యాపారవేదిక. అది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉంది. అంతర్జాతీయ షూటింగులు, హోటళ్ళు అంటూ ఎంతగా చెప్పుకున్నా, నిజంగా వాటిద్వారా లాభం వచ్చిపడుతున్నది లేదు. రకరకాల వ్యూహాలతో విస్తరించుకున్న భూమి విలువే ఇక్కడ ప్రధానమైనది. ఇప్పటికి ఉన్న దానిలోనే కొన్ని అసైన్డ్ భూములు, అనధికారిక విలీనాలు జరిగాయని ఆరోపణలు కొనసాగుతున్నాయి. వాటి నిగ్గుతేల్చే సాహసం ఏ ప్రభుత్వం చేయదు. ఒక దశలో తప్పులుంటే తానే దున్నిస్తాను అన్న కెసిఆర్ కూడా తర్వాత చేతులు కలిపేశారు. ఇప్పుడు ఉన్నదానిపై దర్యాప్తు మాట అటుంచి కొత్తగా వందల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారు. ఏమైనా విమర్శిస్తే పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటకం అంటూ ప్రభుత్వ విధానాలు ఏకరువు పెట్టేస్తారు. ఆధ్యాత్మిక నగరం కట్టిన ఆర్థిక లాభం మటుకు అధినేతలకేనని అందరికీ తెలిసినా అడ్డుకోగలిగిన అవకాశమేదీ? ఒకవేళ ఎవరైనా కేసులూ, న్యాయపోరాటాలూ తలపెట్టినా ఎప్పటికీ తేలడం? సో… అంతా ”రామజీ”మయం! పెద్దాయన ఇప్పుడు అనారోగ్యంగా వున్నారు కనక దీనితో కొంత వూరట పొందొచ్చు