విద్యార్థులు, తల్లిదండ్రులు వద్దన్నా అదే జరిగింది. లీకేజీ జరిగినట్టు రూఢి అయిన మెడిసిన్ ఎంసెట్ 2 ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఎంసెట్ 3 ఎప్పుడనేది నిర్ణయించాల్సి ఉంది.
లీకేజీపై సీఐడీ దర్యాప్తులో రోజురోజుకూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీతో లాభం పొందిన వారి సంఖ్య
పెరుగుతూనే ఉంది. ముందు 30 మంది అనుకున్నారు. తర్వాత 69 అని నిర్ధారణకు వచ్చారు. కాదు కాదు 70 పైనే అనుకున్నారు. ఇప్పుడు 100 దాటిందని రూఢి అయింది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది.
తాజాగా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి బంధువు చాలా మందికి ప్రశ్నపత్రం అమ్మినట్టు అధికారులు గుర్తించారు.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ కొందరు విద్యార్థులు లబ్ధి పొందారని వెలుగులోకి వచ్చింది. అన్ని వివరాలతో సీఐడీ అధికారులు నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పించారు. మంత్రులు, అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడు విద్యార్థులకు అసలైన పరీక్ష. ఇప్పటికే వరసగా పరీక్షలు రాసి అలసిపోయారు. ఎప్పుడెప్పుడు కౌన్సెలింగ్ జరుగుతుందా అని ర్యాంకర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఈ పిడుగులాంటి వార్త తెలిసింది. ఇప్పుడు వాళ్లు పరీక్షలో గెలవడం తర్వాతి సంగతి. ముందు మానసిక ఒత్తిడిని జయించాల్సి ఉంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్, నీట్, ఎంసెట్ 2 రాశారు. కాబట్టి టెన్షన్ సహజం.
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా విపరీతమైన ఆందోళనలో ఉన్నారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు. దీనివల్ల లాభం లేదు. ముందు పిల్లలకు ధైర్యం చెప్పాలి. ఎంసెట్ 2 లీకైంది వాస్తవం. పరీక్ష రద్దయింది వాస్తవం. ఎంసెట్ 3 రాయక తప్పదనేది వాస్తవం. కాబట్టి వాస్తవాన్ని గుర్తించాలి. మన చేతిలో లేని విషయం గురించి ఎంత బాధపడ్డా ఫలితం ఉండదు.
కంగారు పడటం, భయపడటం కాదు కావాల్సింది. కొండంత ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధం కావాలి. ప్రభుత్వం కూడా మూడో పరీక్ష తమ ఒక్కరికే కాదని, మెడిసిన్ ఆశావహులందూ రాయాల్సిందేననే వాస్తవాన్ని గుర్తించాలి. ఎవరు ఒత్తిడిన జయిస్తారో, ఎవరు శ్రద్ధగా చదివి పరీక్ష రాస్తారో వాళ్లే మంచి ర్యాంకు సాధిస్తారు. టెన్షన్ తో తిండి, నిద్ర మానేసి బాధపడుతూ కూర్చుంటే ర్యాంకు రాదు. ఈ విషయం అర్థమైతే ఇక టెన్షనే ఉండదు.