కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లపై అనర్హతా వేటు వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి చుట్టుకుంటోంది. న్యాయపరమైన వ్యవహారాల్లో తప్పులు మీద తప్పులు చేస్తూ… తనకే ఇబ్బందులు తెచ్చి పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు అది అసెంబ్లీ కార్యదర్శుల మెడకు చుట్టుకునే పరిస్థితికి రావడంతో.. హడావుడిగా అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్.. ఎమ్మెల్యేల అనర్హతా విషయంలో మరిన్ని కొత్త సమస్యలు ప్రభుత్వానికి తెచ్చి పెట్టనున్నాయి.
కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి రెండు నెలలు దాటి పోయింది. తీర్పును అమలు చేయకపోవడంతో.. వేటుకు గురైన ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసారు. దీనిపై విచారణలో కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు కోర్టుకు తెలిపారు. అమలుకు రెండు వారాల గడువు అడిగారు. న్యాయమూర్తి వారం గడువునిచ్చారు. ఈ వారంలోపే… తీర్పు అమలు కాకుండా.. అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
పదో తేదీన కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తున్నందున… ఉన్న పళంగా విచారణ చేయాలని… అదనపు అడ్వొకేట్ జనరల్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. కానీ అప్పీల్‌కు 61 రోజుల సమయం తీసుకుని.. ఇప్పుడు అత్యవసర విచారణ చేపట్టాలనడం ఏమిటని… ధర్మాసనం నిరాకరించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. శాసనసభ వ్యవహారాలు కోర్టు పరిధిలోకి రావు అని గట్టిగా వాదించలేకపోయింది. ఓ సారి ఎమ్మెల్యేలతో పిటిషన్లు వేయించింది. ఇప్పుడు నేరుగా శాసనసభ కార్యదర్శులతోనే పిటిషన్లు వేయించింది. పదో తేదీన కోర్టు ధిక్కరణపై ఇద్దరు కార్యదర్శులకు శిక్షలు వేస్తే.. వివాదం మరింత ముదరనుంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగనుందో..!