తెలంగాణలోల తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఆత్రుతగా ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. భారీ లక్ష్యం, భారీ వ్యయంతో నిర్మించే ప్రాజెక్టు ఇది. దీంతో దీనిపై తరచూ సమీక్షలు జరుపుతున్నారు. గురువారం హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులతో చర్చించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదని మంత్రి భరోసా ఇచ్చారు. పనులు శరవేగంగా జరగాలని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి నీరివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనేది ఇక నుంచి హైదరాబాద్ నుంచే పర్యవేక్షిస్తానని చెప్పారు. కాళేశ్వరం నుంచి హైదరాబాద్ కు ఆన్ లైన్ అనుసంధానం ద్వారా ఎప్పటికప్పుడు పనుల తీరును సమీక్షించడానికి హరీష్ రావు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం.
మరోవైపు, వివాదాస్పద మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులు అయ్యే రైతులకు పరిహారం విషయంలోవివాదం తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 ప్రకారం పరిహారం ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే చాలా మంది రైతులు, ప్రతిపక్షాల వారు ఆందోళన చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత కోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రణాళికలో మార్పులు చేస్తూ నివేదిక సమర్పించింది.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈనెలలోనే టెండర్లు పిలవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 10న ఈ ప్రాజెక్టుపైనే ప్రత్యేక సమావేశం జరగబోతోంది.