తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహకర్తలు ట్రాక్ తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. వారు సోషల్ మీడియా ట్రెండింగ్‌లు.. ముఖ్యంగా ట్విట్టర్‌ను ఎక్కువ గొప్పగా చూపించుకుంటున్నారు. ఇటీవల రైతు బంధు జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచిందని సంబరాలు చేసుకున్నారు. రైతు బంధు పథకానికి సంబంధించి ఇంకా పలువురికి డబ్బులు పడలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కూడా అంగీకరించి..ఒకటి, రెండు రోజుల్లో అందరికీ వేస్తామని చెప్పారు. ఆ ఫిర్యాదులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
అయితే రైతు బంధు సంబరాలంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. పార్టీ కార్యకర్తలందరూ ట్వీట్లు చేసి.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలబెట్టారు. దీన్ని మీడియాకు గొప్పగా చెప్పారు. అనుకూల మీడియాలో ప్రచారం చేసుకున్నారు. తాజాగా ఆస్క్ కేటీఆర్ పేరుతో మరోసారి అదే పని చేశారు. కేటీఆర్ ఆ ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నంత సేపు ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉందని హంగామా ప్రారంభించారు. ప్రజల్ని వదిలేసి సోషల్ మీడియా మీద ఆధారపడుతున్న పరిస్థితులు టీఆర్ెస్లో కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా.. పైపైకి అంతా బాగుందని చెప్పుకునేందుకు ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ క్యాడర్లోనే ఉన్న అసంతృప్తిని గుర్తించి.. సోషల్ మీడియా కన్నా.. గ్రౌండ్ లెవల్ ప్రచారానిక ిఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ అంశంపై కేటీఆర్ దృష్టి పెట్టకపోతే.. ట్విట్టర్ లో మాత్రమే టీఆర్ఎస్ హవా కనిపిస్తుందన్న విమర్శలు ముందు ముందు ఎదుర్కోవాల్సి వస్తుందేమో ?