తెలంగాణ మంత్రి హరీష్ రావు ఓ డజను ప్రశ్నలతో లేఖాస్త్రాన్ని విడుదల చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ ప్రశ్నలు సంధించినా.. ఆయన లక్ష్యం అంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కావడం గమనార్హం! తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనీ, ఉంటే నేరుగా పోటీకి దిగేదనీ, ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో మరోసారి రాష్ట్రంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది కాబట్టే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు హరీష్ రావు. చంద్రబాబు మీద ఆధారపడే ప్రభుత్వం తెలంగాణలో ఉంటే, అది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రా బాబే అవుతారనీ, ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉండలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చివరి నిమిషం వరకూ చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు.
తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన పొత్తు పెట్టుకుందా, బేషరతుగా పొత్తు పెట్టుకుందా అనేది ప్రజలకు చెప్పాలన్నారు. గతంలో తాము టీడీపీతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేననీ, అప్పుడు కూడా జై తెలంగాణ అని టీడీపీ చెప్పిన తరువాతే పొత్తు పెట్టుకున్నామన్నారు. కానీ, ఈరోజున కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం మాత్రమే టీడీపీతో అంటకాగుతోందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభించనని టీడీపీ తీర్మానం చేసి కాంగ్రెస్ కు ఇచ్చిందా అని హరీష్ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఆస్తుల పంపకాలు, హైకోర్టు విభజన వంటి అనేక అంశాల్లో తెలంగాణ వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనీ… అలా చెయ్యనంటూ ఆయన హామీ ఇచ్చారా అని ఉత్తమ్ ని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలు ఏడింటినీ తిరిగి తెలంగాణకు ఇచ్చేస్తారా అనేది మరో ప్రశ్న. పోలవరం డిజైన్ మార్పునకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా, పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు కాదని చంద్రబాబు చెబుతారా, కాళేశ్వరంతోపాటు కొన్ని ప్రాజెక్టుపై కేంద్రానికి చేసిన ఫిర్యాదులను చంద్రబాబు వెనక్కి తీసుకుంటారా, మిషన్ భగీరథ మీద కూడా చంద్రబాబు ఫిర్యాదు చేశారనీ… ఇలా వరుసగా ఉత్తమ్ కు కొన్ని ప్రశ్నలు వేశారు.
ఈ ప్రశ్నలు వేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయినా… తెరాస ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడుపైనే ఉందనేది చాలా స్పష్టంగా హరీష్ రావు ప్రతీమాటలో ధ్వనిస్తూనే ఉంది! రాబోయే ఎన్నికల్లో తెరాస పోరాడుతున్నది కాంగ్రెస్ తోనా, లేదా టీడీపీతోనా అనే అనుమానం కలుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు! ఇంకోటి… గతంలో ఇదే తెరాస నేతలు చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అని విమర్శించారే! అంటే, ఒక కంటితో తెలంగాణ గురించి ఆయనా ఆలోచిస్తున్నారని ఒప్పుకున్నట్టే కదా! మరి, ఇప్పుడేమో తెలంగాణ వ్యతిరేకి అని చిత్రించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు..? అయినా, తెలంగాణలో రాబోయే ఎన్నికలు జరుగుతున్నది గడచిన నాలుగున్నరేళ్ల తెరాస పాలన మీదా… తెలంగాణ విషయంలో పక్క రాష్ట్ర అనుసరించిన ముఖ్యమంత్రి వైఖరి మీదనా..? తెలంగాణలో కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే… టీడీపీని లక్ష్యంగా విమర్శలు చేసుకోవడం సరైన వ్యూహం ఎలా అవుతుంది..? ఇలా ప్రతీ మాటలోనూ టీడీపీని విమర్శిస్తూ పోతే… రాష్ట్రంలో ఆ పార్టీ బలాన్ని తెరాస పెంచుతున్నట్టు అవుతుంది కదా!