రేపోమాపో కవితను ఈడీ పిలుస్తుంది.. ఆ తర్వాత అరెస్ట్ చేస్తుంది.. అంటూ బీజేపీ నేతలు టీఆర్ఎస్పై మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ దర్యాప్తు టీఆర్ఎస్ పెద్దల బంధువుల గుట్టు బయటపడిందన్న ప్రచారంతో బీజేపీ నేతలు మరింతగా చెలరేగిపోతున్నారు. టీఆర్ఎస్ క్యాడర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ నేతలు చెప్పినట్లుగా జరుగుతుందో లేదో కానీ.. ఎవరూ తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. అయితే ఈ మైండ్‌గేమ్‌కు టీఆర్ఎస్ వద్ద సమాధానం లేకపోయింది.
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం అక్కడ కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ సిండికేట్లకు నిధులన్నీ తెలంగాణ నుంచే వెళ్లాయని సీబీఐ, ఈడీ కంటే ముందే బీజేపీ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి అదే నిజమనించేలా చేస్తున్నాయి. అయితే ఇందులో వ్యాపార కోణమే ఉంటే సమస్యే ఉండదు. కానీ ఇక్కడంతా రాజకీయమే ఉంది.
బీజేపీ నేతల విమర్శలకు టీఆర్ఎస్ ఘాటుగా సమాధానం చెప్పలేకపోతోంది ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఇతర విషయాల్లో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎవరూ స్పందించడం లేదు. కానీ ప్రధాని మోదీని విధాన పరంగా విమర్శించడానికి కేటీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు నేరుగా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇతర పార్టీ నేతలు మాత్రం గుంభనంగా ఉంటున్నారు. బీజేపీ విషయంలో ఎలా డీల్ చేయాలో.. ముఖ్యంగా లిక్కర్ స్కాం.. ఈడీ దాడుల విషయంలో ఎలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతున్నారు.