తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేసీఆర్‌పై .. ఓ రేంజ్‌లోనే విమర్శల వర్షం కురిపించారు. “తెలంగాణను కాపాడేది నువ్వా “..అంటూ.. కేసీఆర్ పైనా ఫైరయ్యారు. ఆ తర్వాతి రోజు అంటే.. ఆదివారం… అమిత్ షా వ్యాఖ్యలపై ఇతర నేతలెవరూ స్పందించలేదు కానీ.. ఒక్క కేటీఆర్ మాత్రం ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. గుజరాత్లోముందస్తుకు మోడీ వెళ్లలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు బీజేపీ లేదని..తమకు కాంగ్రెస్‌తోనే పోటీ అని తేల్చారు. రెండు పార్టీల నేతల విమర్శలు చూస్తే..తీవ్రంగా పోరాడేసుకుంటున్నారని సామాన్యులు అనుకుంటున్నారు కానీ… మహాకూటమి ఎఫెక్ట్‌తో “ప్లాన్ బీ” అమలు చేస్తున్నారన్న విశ్లేషణలు మాత్రం ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
తెలంగాణలో విపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా అవతరించాయి. ఇప్పుడు పోటీ.. టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి అన్నట్లుగా… ద్విముఖ పోటీగా మారిపోయింది. ఇదే జరిగితే.. ఓట్లన్నీ.. రెండు వైపుల మాత్రమే పోలరైజ్ అవుతాయి. ఇది అధికార పార్టీకి చాలా నష్టం చేకూరుస్తుంది. అధికార వ్యతిరేక ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే… టీఆర్ఎస్కు అంత లాభం. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి తీసుకు రావడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే దక్షిణాదిలో మద్దతుగా నిలిచే పార్టీలు ఎక్కువగా సీట్లు సాధించాలి. అలాంటి మద్దతు తామిస్తారని.. టీఆర్ఎస్ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు జరిగితే.. ఐదారు నెలల తేడాతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని.. ఆ మేరకు బీజేపీకి మద్దతు పెరుగుతుందన్న నమ్మకాన్ని టీఆర్ఎస్ అధినేత బీజేపీ అగ్రనేతలకు కల్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటోంది. అదే సమయంలో టీఆర్ఎస్ గెలవాలనుకుంటోంది. అలా జరగాలంటే.. కాంగ్రెస్ కూటమికి వచ్చే ఓట్లను చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలి. దాని వల్ల టీఆర్ఎస్ లాభపడుతుంది. దీని కోసమే బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై దాడి ప్రారంభించారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతారవణం కల్పించడం ద్వారా… కాంగ్రెస్ కు వచ్చే కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవచ్చనేది అసలు టార్గెట్. ఈ లక్ష్యంలో టీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీలకు ఉపయోగం. మహాకూటమితో ఓట్లు పోలరైజ్ అవుతున్న సమయంలో.. ఈ “ప్లాన్ బీ”ని చాలా చాకచక్యంగా అమలు చేసే ఉద్దేశంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.