హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ-బీజేపీ కూటమి చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ పరిస్థితి మింగలేక – కక్కలేక అన్నట్లుగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న దాదాపు 25-30 లక్షలమంది సీమాంధ్ర ప్రాంత సెటిలర్స్‌ను ఆకట్టుకోవటంకోసం – ఆంధ్రావాలో భాగో అని పిలుపునిచ్చిన టీఆర్ఎస్తో సహా అన్నిపార్టీలూ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాము గతంలో ఉద్యమ సమయంలో పరుషంగా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, సీమాంధ్రవాసులంటే తమకు ఎలాంటి వ్యతిరేకతా లేదని కేటీఆర్ చెప్పారు. ఈ 18 నెలల కాలంలో ఆంధ్రోళ్ళపై ఈగ కూడా వాలనీయలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంత సెటిలర్స్‌కు 10 – 12 డివిజన్లలో టీఆర్ఎస్ టికెట్లు ఇస్తామని కూడా చెబుతున్నారు. దీనిని ఎదుర్కోవటంకోసం టీడీపీ-బీజేపీ కూటమి మరో అడుగు ముందుకేసి డిప్యూటీ మేయర్ పదవినే సీమాంధ్రవాసులకు ఇస్తామని ప్రకటించేసింది. దీనితో టీఆర్ఎస్కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. మామూలుగా అయితే తెలంగాణ గడ్డపైన ఒక డిప్యూటీ మేయర్ పదవిని సీమాంధ్రప్రాంత వాసులకు ఇస్తానంటారా అని టీఆర్ఎస్ నేతలు విరుచుకు పడేవారే. కానీ ఇప్పుడు అలా చేస్తే సీమాంధ్ర ఓట్లకు నీళ్ళొదులుకోవాల్సి వస్తుంది. అందుకే మింగలేక, కక్కలేక నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు గులాబీ నేతలు… పాపం!