టీఆర్ఎస్ బీజేపీకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తోంది. అత్యంత కీలకమైన విషయాలు.. టీఆర్ఎస్ విషయంలో బీజేపీ వ్యూహాలు అన్నీ కేసీఆర్‌కు ముందే తెలిసిపోతున్నాయి. అది కేవలం పార్టీ పరమైనవే కాకుండా… రైతు చట్టాలను వెనక్కి తీసుకోబోతున్నారన్న విషయం కూడా టీఆర్ఎస్ అధినేతకు ముందే తెలిసింది. ఇలాంటి కీలక విషయం .. ఢిల్లీలోని అత్యున్నత వర్గాలకే తెలియదు. కానీ టీఆర్ఎస్కు ఉప్పందింది. అలాగే టీఆర్ఎస్ విషయంలో ఎప్పుడేం చేయబోతున్నారో కూడా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా టీఆర్ఎస్ ముందుగానే కౌంటర్ రెడీ చేసుకుంటోంది.
తాజాగా విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయం బయటకు రాక ముందే కేసీఆర్… ప్రత్యేకంగా తెలంగాణనే వేడుకలు చేయబోతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో బీజేపీ ప్లాన్‌కు గండిపడినట్లయింది. ఇక ఈడీ , ఐటీ దాడుల విషయంలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పార్టీ నేతల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎవరెవర్ని టార్గెట్ చేశారో చెబుతున్నారు. జాగ్రత్త పడాలని వారికి సందేశాలు పంపుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎల్పీ భేటీలోనూ అదే చెప్పారు. ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయని.. ఎదుర్కొందామని చెప్పారు.
టీఆర్ఎస్ మీడియాలో ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన ఐదుగురు ఆఫీసర్లను బదిలీ చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతల సిఫార్సులే కారణమని టీఆర్ఎస్ మీడియా చెబుతోంది కానీ.. బదిలీల ప్రక్రియ గురించి తెలిసి వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోందని అంటున్నారు. రాజకీయ పరమైన.. పాలనా పరమైన అంశాల్లో ఢిల్లీ నుంచి కేసీఆర్‌కు నమ్మదగిన ఇన్ఫో వస్తోందని బీజేపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆ విషయంలో టీఆర్ఎస్కు సహకరిస్తోంది ఎవరన్నదానిపై .. బీజేపీ వర్గాలు ఇప్పటికే ఓ కన్నేసినట్లుగా చెబుతున్నారు. సొంత పార్టీ నేతలే ఇలా చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వారిని ఐడెంటిఫై చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారు నిజంగా ఉండి ఉంటే.. కేసీఆర్ అండర్ కవర్ ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్‌గా చేస్తున్నట్లేనని కొంత మంది భావిస్తున్నారు.