మళ్లీ సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. అందరూ ప్రజల్లోకి వెళ్లాలని.. పది నెలల్లోనే ఎన్నికలు వస్తున్నందున.. ఎన్నికల సన్నాహాలు ప్రారంభించుకోవాలని చెప్పారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే కేసీఆర్ ప్రకటన వారిలో చాలా మందికి నమ్మశక్యం కాకుండా ఉంది. ఎందుకంటే.. సర్వేల ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తామని.. ఎవరూ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకోవద్దని.. కష్టపడిన వారికే ప్రయోజనం ఉంటుందని.. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు సర్వేల ప్రస్తావన తీసుకు రాకుండా సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఇదంతా వలసల భయంతోనే చెప్పి ఉంటారని టీఆర్ఎస్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలపై బీజేపీ పూర్తి స్థాయిలో కన్నేసింది. నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. బలమైన అభ్యర్థులు ఉన్న చోట బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఇలాంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోగలినంత మందిని తీసుకుంటోంది. ఇక మిగిలింది సిట్టింగ్ ఎమ్మెల్యేలేనని… వారిపై బీజేపీ కన్నేసిందని చెబుతున్నారు. దీంతో వారికీ ఆఫర్లు వస్తాయని..టీఆర్ఎస్లో టిక్కెట్ గ్యారంటీ లేదనుకుంటే వారంతా అటు జంప్ చేసినా ఆశ్చర్యం లేదని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది.
వారిని ఇప్పటికిప్పుడు ఆపేందుకు కేసీఆర్ అందరికీ టిక్కెట్లు కన్ఫర్మ్ అన్నట్లుగా చెప్పారని అంటున్నారు. బీజేపీ నుంచి ఒత్తిళ్లు వస్తాయని.. పార్టీ మారమని ఎవరైనా ఫోన్ చేసినా.. చెప్పుతో కొడతామని చెప్పండని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ఇప్పటికే ఓవర్ లోడ్ అయింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ముగ్గురు, నలుగురు తయారయ్యారు. గతంలోనే సిట్టింగ్‌లందరికీ సిట్లు కేటాయించినప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. అప్పుడు సర్ది చెప్పారు. ఇప్పుడు సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇచ్చినా.. ఇవ్వకపోయినా. పోటీ నేతలకు ప్రత్యామ్నాయం కళ్ల ముందే కనిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్ అధినేత.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనపిస్తోంది.