గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై రకరకాల లెక్కలు నడుస్తున్నాయి. వందకు పైనే వస్తాయని పదేపదే చెబుతున్న టిఆర్ఎస్ ప్రచార సారథి కెటిఆర్ తన రాజీనామా సవాలుకు వందను కొలబద్దగా తీసుకోవడం లేదు. దీనికి కారణముందంటున్నారు టిఆర్ఎస్ ముఖ్యులు. అంతర్గతంగా వారు అప్పుడప్పుడు చేయించిన సర్వేలు 90కిపైన వస్తాయని చెబుతున్నాయి. గత పరిస్థితితో పోలిస్తే అది చాలా పెద్ద విజయమే అవుతుంది. వూరికే ప్రతిష్టకు పోయి వంద సవాలుకు ఒప్పుకుంటే ఆ విజయం కన్నా సవాలు నిలబెట్టుకోలేదన్న విమర్శలు ఆ విజయానందాన్ని హరించేస్తాయి. ఒక వేళ మరేదైనా కారణంతో ఇంకా తక్కువొస్తే మేయర్ పీఠం దక్కించుకున్నా ఓటమిని ఒప్పుకున్నట్టవుతుంది. కనుకనే ఈ సవాలుపై ఇక స్పందించే అవకాశం ఇవ్వరాదని టిఆర్ఎస్ నిర్ణయించుకుంది. అన్ని సర్వేల సగటు చూసినప్పుడు 90-95 మధ్య సంఖ్య తేలుతుందని టిఆర్ఎస్ అధినేతలకు దగ్గరగా వుండే ఒక ఎంపి చెప్పారు. మామూలు పరిస్థితుల్లో టిఆర్ఎస్కు 50 స్థానాలకు కాస్త ఎక్కువగా రావచ్చని, కాని గాలి అనుకూలంగా మారితే ఈ సంఖ్య 90-100 వరకూ పోవచ్చని అధికార రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్న ఒక సీనియర్ పాత్రికేయుడు చెబుతున్నారు.
టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తగ్గినా క్షేత్ర స్థాయిలో యంత్రాంగ లోపం అభ్యర్థుల ఎంపికలో సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది అంటున్న మాట. అయితే పైన పేర్కొన్న ఎంపి ఆ వాదనతోనూ ఏకీభవించడం లేదు. కనీసం 70 స్థానాల్లో తాము చాలా గట్టి అభ్యర్థులను నిలబెట్టామని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని తిరుగుబాటు అభ్యర్థుల వల్ల బిజెపి టిడిపి తగాదాల వల్ల తమకు వచ్చేస్తాయని భావిస్తున్నారు. మజ్లిస్ ఖాతాలో వేస్తున్న వాటిలోనూ ఏడెనిమిది చోట్ల తాము గెలిచే అవకాశమున్నదని టిఆర్ఎస్ ఆశిస్తున్నది. ‘మరి అన్నీ మీకే వచ్చేస్తే మిగిలిన పార్టీలకు అస్సలస్సలు రావా…’ అని అడిగితే దాదాపు అలాగే జరగబోతుంది చూడండి అని నవ్వులు కురిపించాడా ఎంపి.
కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం జరిపే సుదీర్ఘ మీడియా సమావేశంతో చాలా అంశాల్లో స్పష్టత వచ్చేస్తుందని, 30న జరిగే పెద్ద బహిరంగ సభతో రాజకీయంగా మార్పుకు రంగం సిద్ధమవుతుందని టిఆర్ఎస్ బలంగా ఆశపడుతున్నది. అవకాశాలు అధికంగా వున్న మాట నిజమైనా చూడాలి అతిశయించిన ఆశలు ఏ మేరకు నెరవేరతాయో!
టిఆర్ఎస్ అంతా గెలిచేస్తే…మాజీ ఎంపి వ్యాఖ్య
‘ఒకసారి హైదరాబాదుపై గులాబీ జండా ఎగరేస్తే తెలంగాణ రాజకీయాలు మరో పెద్ద మలుపు తిరుగుతాయి. టిఆర్ఎస్ను ఇక ఆపే ప్రసక్తి వుండదు,’ అని కాంగ్రెస్ మాజీ ఎంపి వొకరు వ్యాఖ్యానించారు. హరీష్ కన్నా కెటిఆర్ చాలా ఖతర్నాక్. ఆయన హయాంలో అంతా గెలిచేస్తే హైదరాబాదులో పాత రోజులనాటి పరిస్థితులు పునరావృతం కావచ్చునని ఆయన అన్నారు. ఆయన ఉపయోగించిన పదమైతే ‘లంపెనైజేషన్’. తమ పార్టీకి పెద్దగా అవకాశాలు లేవని మాత్రం అంగీకరించారు.