ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేసుకున్న విజయగర్జన బహిరంగసభను ఇప్పుడల్లా నిర్వహించే యోచనలో టీఆర్ఎస్ లేనట్లుగా కనిపిస్తోంది. పదహారో తేదీన ఎన్నికల కోడ్ ముగుస్తుంది. పెట్టాలనుకుంటే 17వ తేదీన విజయగర్జన నిర్వహించవచ్చు. కానీ అలాంటి ఆలోచనలు టీఆర్ఎస్ హైకమాండ్ చే్యడం లేదు. కారణం చెప్పుకోవాలంటే ఈ సారి ఒమిక్రాన్ ఉండనే ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆ హడావుడి ఉండే అవకాశం ఉంది.
అసంతృప్తికి గురైన ఆశావహుల్ని ఏదో విధంగా సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ ప్రయత్నించాల్సి ఉంది. నామినేటెడ్ పదవులు లేదా పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్య పదవులను వారికి ఇవ్వాలనికేసీఆర్ భావిస్తున్నారు. చాలాకాలంగా ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఆశించి, అవకాశం రాని నేతలు.. 2023 సాధారణ ఎన్నికలలోపు ఏదో ఒక పదవిని దక్కించుకోవడంపై దృష్టిపెట్టారు. నామినేటెడ్ పదవులుగానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోచోటుగానీ దొరికితేనే.. భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావి స్తున్నారు. లేకపోతే పక్కచూపులు చూడటం ఖాయమని భావిస్తున్నారు.
80కిపైగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సం స్థలకు సంబంధించిన కార్పొరేషన్లు ఉండగా.. అం దులో ప్రస్తుతం 35 కార్పొరేషన్లకు మాత్రమే పాలక మండళ్లు ఉన్నాయి. కీలక కార్పొరేషన్ల పాలకమండళ్లు ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. వీరందర్నీ సంతృప్తి పరిచేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి.. విజయగర్జనను ఏప్రిల్లో నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.