తెరాస ఎమ్మెల్యే షకీల్ పార్టీ మారలేదుగానీ… భాజపా ఎంపీ అరవింద్ ని ఆయన కవడంతో అధికార పార్టీకి దాదాపు పరువు పోయినంత పనైంది అనడంలో సందేహం లేదు. సీఎం కేసీఆర్ గీసిన గీత దాటేవారు తెరాసలో లేరనీ, ఆయన నాయకత్వంలో నాయకులెవ్వరూ అసంతృప్తిగా లేరంటూ ఇన్నాళ్లూ కనిపించిన ఒక అభిప్రాయాన్ని తాజా పరిణామం బ్రేక్ చేసినట్టయింది. రాష్ట్రంలో ఇన్నాళ్లూ సరైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నాయకులకు వేరేదీ కనిపించకపోవడమే… తెరాసలో ఐక్యతారాగానికి కలిసొచ్చిన అంశమా అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తోంది. ఎమ్మెల్యే షకీల్ ఎపిసోడ్ దెబ్బకి తెరాస ఇప్పుడు మరింత అప్రమత్తం అయిందని తెలుస్తోంది.
మంత్రి వర్గ విస్తరణ తరువాత… జిల్లాల వారీగా అసంతృప్తితో ఉన్న తెరాస నాయకుల జాబితాను భాజపా రెడీ చేసుకుందనే కథనాలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. దీంతో తెరాస కూడా యాక్టివ్ అయిందని తెలుస్తోంది. పార్టీలో కొంతమంది నాయకులకు కొన్ని జిల్లాల బాధ్యతలు అప్పగించారట. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర స్థాయిల నాయకులు… వారిలో అసంతృప్తితో ఎవరెవరున్నారు, వారి డిమాండ్లు ఏంటనేవి తెలుసుకునే ప్రయత్నం అంతర్గతంగా చేస్తున్నట్టు తెరాస వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి నాయకులు ఎవరైనా ఉంటే… వెంటనే రంగంలోకి దిగి, వారితో చర్చించేందుకు పార్టీ అధినాయకత్వం కూడా సిద్ధంగా ఉందనే సంకేతాలు వెళ్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… భాజపా చేతికి ఒక్కరంటే ఒక్క కీలక తెరాస నేత కూడా చిక్కకూడదన్నది అధినాయకత్వం వ్యూహం.
సెప్టెంబర్ 17 టార్గెట్ తో భాజపా కూడా ముమ్మర ప్రయత్నాల్లోనే ఉందన్నది తెలిసిందే. ఆరోజున కొంతమంది తెరాస నేతలు చేరబోతున్నారంటూ భాజపా నేతలు ఇప్పటికే లీకులిస్తున్నారు. ఆ లీకులు నిజమైనవేనా.. లేదంటే, ఇతర నాయకుల్ని ఆకర్షించేందుకు వేస్తున్న ఎత్తుగడలో భాగమా అనే క్రాస్ చెకింగ్ పనిలో కూడా తెరాస ఉందని తెలుస్తోంది. మొత్తానికి, ఎమ్మెల్యే షకీల్ ఎపిసోడ్ తో తెరాస నాయకత్వం బాగా యాక్టివ్ అయింది! మంత్రి వర్గ విస్తరణ భాజపాకి ఈరకంగా బాగానే కలిసొచ్చింది. ఈ కట్టుదిట్ట ఏర్పాట్ల నేపథ్యంలో ప్రస్తుతానికి తెరాస నుంచి ఎవ్వరూ చేజారకపోయినా… భాజపా ఎఫెక్ట్ తెరాస మీదకు ఎప్పటికైనా ఉండే అవకాశం ఉంటుందనడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణగా మారుతోంది.