ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ మరింత వేడెక్కిస్తోంది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షాలకు ఎన్నెన్ని సీట్లు ఇస్తారనే అంశాన్ని ఇప్పటికీ తేల్చడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వారంలో తెలంగాణ వస్తున్నారు. ఆయన పర్యటన ముగిసిన తరువాతే సీట్ల కేటాయింపులపై స్పష్టత రావొచ్చని భావించొచ్చు. అయితే, రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ కథనం రాజకీయ వర్గాల్లో చర్చనీయం అవుతోంది..! ఓపక్క మిత్రపక్షాలతో సీట్ల బేరాలు కొనసాగిస్తూనే… మరోపక్క అధికార పార్టీకి చెందిన కీలక నేతల్ని ఆకర్షించే వ్యూహం అమలు చేస్తున్నట్టు సమాచారం.
రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో… కాంగ్రెస్ లోకి చేరేందుకు ఓ ఇద్దరు ప్రముఖ నేతలు సిద్ధంగా ఉన్నారనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో ఉన్న ఆ నేతలతోపాటు, మాజీలతో కలిపి… మొత్తంగా ఐదుగురు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం..! అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టిందనీ, ఏఐసీసీకి చెందిన ఒక కీలక నేత ఈ వ్యవహారాన్నంతా తెర వెనక నడిపిస్తున్నారట..! ఇది తెరాసకు కచ్చితంగా పెద్ద షాక్ కాబోతోందని కూడా కొంతమంది అంటున్నారు. ఈ నెల 20న రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో… ఆయన సమక్షంలోనే ఈ ప్రముఖుల చేరికలు ఉంటాయనీ అంటున్నారు.
అయితే, ఈ చేరికల ప్రభావం మహా కూటమి భాగస్వామ్య పక్షాలపై కూడా కచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి. ఎలా అంటే… ఇప్పటికే ఒక్కో పార్టీకీ పదికి మించి సీట్లు ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ లేనట్టుగా కనిపిస్తోంది. ఈలోగా చేరికలు కూడా అంటున్నారు. మరి, కొత్తగా చేరిన నేతలకు తప్పనిసరిగా టిక్కెట్లు ఇవ్వాలి కదా! ఆ మేరకు కూటమి ఖాతాలోనే కోత పడే అవకాశం ఉంది. మొత్తానికి, భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ కొంత లైట్ గా తీసుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఎలాగూ చేరికలు ఉంటాయి కాబట్టి… ఆ తరువాత కూటమి పక్షాల సీట్ల కేటాయింపు గురించి ఆలోచించొచ్చు అనే వైఖరిలో కాంగ్రెస్ ఉన్నట్టుంది. చేరికల వల్ల కాంగ్రెస్ మరింత బలోపేతంగా కనిపిస్తుంది కాబట్టి… అప్పుడు తాము ఎన్ని సీట్లు ఇస్తామనంటే… అన్ని సీట్లను కాదనకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ఇతర పార్టీలకు ఏర్పడుతుందని భావిస్తోంది. ఇంతకీ… పార్టీలో చేరబోతున్న ఆ ప్రముఖులెవరూ, ఆ వ్యూహం ఏంటనేది త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.