తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అయ్యారు. డీఎస్ కుమారుడు.. ధర్మపురి అరవింద్ కూడా… బీజేపీ ఎంపీనే. ఆయన గత ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితను.. ఓడించి మరీ లోక్‌సభలో అడుగుపెట్టారు. దాంతో ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు డీఎస్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పటికీ… ఏ పార్టీలో లేని పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ దూరం పెట్టేసింది. మళ్లీ దగ్గరకు తీస్తుందన్న గ్యారంటీ లేదని.. తేలిపోయింది. తానే దగ్గరగా ఉన్నానని ప్రకటించినా.. టీఆర్ఎస్ మాత్రం లైట్ తీసుకుంది. కాంగ్రెస్ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు… తాను చేరి మాత్రం చేసేదేముందని అనుకున్నారేమే కానీ.. నేరుగా వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు.
టీఆర్ఎస్తో కలిసి ఉండాలని.. డీఎస్ అనుకున్నారు. కానీ డీఎస్ మార్క్ రాజకీయాల్ని టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోయారు. అందుకే.. ఆయనను దూరం పెట్టారు. సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్సు అయితే.. నిజామాబాద్ జిల్లా నేతలతో చేయించారు కానీ… ఆ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. సస్పెన్షన్ వేటు వేస్తే.. ఆయన వెళ్లి ఇతర పార్టీలో చేరడానికి ఆమోదం తెలిపినట్లవుతుందన్న కారణంగా.. ఆయనను అలా ఆపేశారు. దాంతో.. డీఎస్‌కు ఇతర పార్టీలో చేరే చాన్స్ లేకుండా పోయింది. టీఆర్ఎస్తోనే ఉందామని.. ఆయన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు కూడా వెళ్లారు. ఆయనను ఆయనను ఎవరూ పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి హైకమాండ్ కూడా డీఎస్ ఎందుకొచ్చారని.. ఆరా తీయడంతో.. మిగిలిన ఎంపీలు.. ఆందోళనకు గురయ్యారు. ఇక ఏం చేసినా.. ఆయనకు టీఆర్ఎస్లో ఎంట్రీ ఉండదని దాంతోనే తేలిపోయింది.
గత ముందస్తు ఎన్నికలకు ముందు.. ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా భేటీ అయ్యారు. సోనియా గాంధీని కూడా కలిశారు. అయితే.. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి సైలెంటయిపోయారు. ఏ పార్టీలో చేరలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లేనని… రాజ్యసభ సభ్యత్వంపై అనర్హతా వేటు వేస్తారన్న కారణంగానే ప్రకటించలేదని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అమిత్ షా కారణం లేకుండా ఎవర్నీ కలవరు. పార్టీలో చేరికపై.. స్పష్టత ఇచ్చినందునే.. డీఎస్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. అధికారం బీజేపీ చేతుల్లోనే ఉంది.. డీఎస్ రాజ్యసభ సభ్యత్వానికి.. బీజేపీ రక్షణగా నిలుస్తుంది.